కర్ణాటకలోని బెళగావికి చెందిన జంట. ఇద్దరిదీ అన్యోన్యమైన దాంపత్యమే. కానీ వాళ్లిద్దరి మధ్య చిచ్చుపెట్టింది ‘అతి శుభ్రత’ అనే మానసిక సమస్య. భార్యకున్న అతి శుభ్రత పిచ్చిని తట్టుకోలేక, ఆమెతో ఇక బతకలేను విడాకులు ఇప్పించండంటూ కోర్టుకెళ్లాడు భర్త. తన ఫోను, ల్యాప్‌టాప్‌ను కూడా బట్టలు ఉతికినట్టు డిటెర్జెంట్ లో వేసి ఉతికేస్తోందని చెబుతున్నాడు. ఇవే కాదని, అన్ని వస్తువుల పట్ల ఆమె అలానే వ్యవహరిస్తోందని అంటున్నాడు.
ఇది వారి కథ..
రాహుల్‌కు సుమతో (ఇద్దరి పేర్లు మార్చాం) 2009లో పెళ్లైంది. రాహుల్ పెద్ద ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెళ్లయ్యాక ఆన్‌సైట్ ఆఫర్ రావడంతో యూకే వెళ్లారు. అక్కడే కొన్నాళ్లు ఉన్నారు. సుమ ఇంటిని చాలా శుభ్రంగా, అందంగా ఉంచడం చూసి చాలా ఆనందపడ్డాడు రాహుల్. రెండేళ్ల తరువాత వారిద్దరికీ ఒక బాబు పుట్టాడు. సుమకు తెలియకుండానే ఆమెలో ఓసీడీ (ఆబ్సెసెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్) పెరుగుతూ వచ్చింది. ఆమెకు అతి శుభ్రత ఎక్కువైపోయింది. రాహుల్ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే వేసుకున్న దుస్తులు, షూ, బ్యాగులు అన్నీ ఉతకమని చెప్పేది. రోజూ ఇది టార్చర్ లా మారింది రాహుల్ కు. ఇద్దరిమధ్య గొడవలు పెరిగాయి.
యూకే నుంచి భారత్ వచ్చాక ఇద్దరూ కౌన్సిలింగ్ కోసం వెళ్లారు. కౌన్సిలింగ్ వల్ల కాస్త పరిస్థితి మెరుగుపడింది. వారికి రెండో బిడ్డ కూడా కలిగాడు. ఆ తరువాత కోవిడ్ మహమ్మారి కమ్ముకొచ్చింది. సుమలో మళ్లీ ఓసీడీ రోగం పెరిగి పెద్దదైంది. భర్తను అతి శుభ్రతతో వేధించడం మొదలుపెట్టింది. ఓసారి అతని ఫోను, ఆఫీసు ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్ కలిపిన నీళ్లలో వేసి ఉతికేసింది. దీంతో మళ్లీ గొడవలు పెరిగి, వైవాహిం బంధం క్షీణించింది. ఆమె ఇంట్లోని ప్రతి వస్తువును కడగడం ప్రారంభించింది. ఆమె అతి శుభ్రత భరించలేని స్థాయికి చేరుకుంది. రోజుకు ఆరుసార్లు స్నానం చేసేది సుమ.
దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే వారున్న ఇంట్లోనే రాహుల్ తల్లి మరణించారు. ఆమె మరణించాక భర్త, పిల్లలను ఇంటి బయటే ఉంచింది. 30 రోజుల పాటూ ఇంటిని శుభ్రపరిచి ఆ తరువాతే ఇంట్లోకి రానిచ్చింది. పిల్లలను కూడా స్కూలు నుంచి వచ్చాక యూనిఫాంలు, షూ, బ్యాగులు ఉతకమని బలవంతం చేసేది. ఇదంతా చూసి విసిగిపోయిన భర్త పిల్లలను తీసుకుని తండ్రి ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో సుమ పోలీసు కంప్లయింటు ఇచ్చింది. ఇప్పటికీ మూడు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఆమెలో ప్రవర్తనలో కానీ, రాహుల్ నిర్ణయంలో కానీ మార్పు రాలేదు. తన భర్త కావాలనే తన శుభ్రతా అలవాట్లను అసాధారణమైన వాటిగా బయటి వారికి చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ అతనిపై కేసు వేసేందుకు సిద్ధమైంది. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం విచారణ దశలోనే ఉంది.
Read also: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Read also: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
Read also: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది
Read also: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?
Read also: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి