టమోటోలేనిదే తెలుగిళ్లల్లో కూరల దగ్గర నుంచి బిర్యానీల వరకు ఏదీ సిద్ధమవదు. అన్నింట్లోనూ ఒక్క టమోటో అయినా పడాల్సిందే. అందుకే టమోటో రేటు పెరిగితే చాలు... అది పెద్ద వార్తయిపోతుంది. అంతగా మనం టమోటోపై ఆధారపడిపోయాం. టమోటో ఆరోగ్యపరంగా మనకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. దీన్ని రోజూ తినేవాళ్లలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. దీనిలో లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకునే శక్తి కూడా దీనికి ఉంది. అందుకే టమోటోలను రోజూ తినమని చెబుతారు వైద్యులు. వీటిలో బీటాకెరోటిన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది అతినీలలోహిత కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షిస్తుంది.  కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. టమోటోలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి మన ప్రధాన అవయవాలను కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. టమోటోలు ఇచ్చే ప్రయోజనాలను రెట్టింపు స్థాయిలో పొందాలంటే రోజూ కప్పు టమోటో సూపును వేడివేడిగా లాగించాలి. రోజూ టమోటో సూప్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ మనకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. 


టమోటో సూప్ ఇలా చేయండి


కావ‌ల్సిన ప‌దార్థాలు
టమోటోలు – మూడూ
నీళ్లు – ఒకటిన్నర కప్పు
జీలకర్ర పొడి – ఒక టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్
మిరియాల పొడి – ఒక టీస్పూన్‌
ఉప్పు – రుచికి తగినంత


తయారు చేసే విధానం
టమోటాలను బాగా ఉడికించాలి. వాటిని మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును నీళ్లలో వేసి స్టవ్ మీద కాసేపు ఉడికించాలి. ఉడుకుతున్నప్పుడే మిరియాల పొడి, జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద పావుగంటసేపు ఉడికించాక, మిశ్రమం కాస్త చిక్కగా మారుతుంది. అప్పుడు దించేయాలి. చలికాలంలో వేడివేడిగా ఈ టమోటా సూప్ తాగుతుంటే శరీరానికి హాయిగా ఉంటుంది. గొంతు దురద వంటి సమస్యలు కూడా పోతాయి. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?


Read Also: కొత్త వేరియంట్ కమ్ముకుంటున్న వేళ... ఎవరికి బూస్టర్ డోస్ అవసరం?
Read Also:  అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Read Also: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి