తెలుగు సంవత్సరాదిలో తొలిరోజు ఉగాది (Ugadi 2023). జనవరి 1ని అందరూ ఏడాదికి మొదటి రోజుగా చెప్పుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజు కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ఇతర రాష్ట్రాల్లోనూ ఉగాది పెద్ద వేడుక. ఆ రోజు ఇష్ట దైవాన్ని పూజించుకుని ఉగాది పచ్చడిని ప్రసాదంగా నివేదిస్తారు. ఈ పచ్చడిని రుచి చూసాకే ఆరోజు ఏమైనా ఇతర ఆహారాలు తింటారు. ఆరు రుచుల కలయికతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఎంతో. ఈ పచ్చడిలో ఆరు రోజులు జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తాయని చెబుతారు.


తీపి, కారం, పులుపు, ఉప్పు, వగరు, చేదు రుచుల కలయికతో ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. బెల్లం, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, మామిడికాయ, వేప పువ్వుని ఆనవాయితీగా పచ్చడి తయారీలో ఉపయోగిస్తారు. కొంతమంది అదనంగా అరటిపండు, కొబ్బరి కోరు, పుట్నాల పప్పులులాంటివి కూడా వేసుకుంటారు. అది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఉగాది పచ్చడి నోట్లో వేసుకోగానే తీపి తగిలితే ఆ ఏడాదంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. అదే చేదు తగిలితే కష్టాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటారు. పులుపు తగిలితే కష్ట సుఖాల కలయికగా ఉంటుందని అంటారు. అంతేకాకుండా ఈ ఉగాది పచ్చడి తయారీలో ఒక ఆధ్యాత్మిక భావన కూడా ఉంది. ఉగాది పచ్చడి తినేటప్పుడు ఏ రుచి మీకు తగులుతుందో అంచనా వేయడం కష్టం. అలాగే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చిన జీవితాన్ని ముందుకు నడిపించాలనే భావన ఉగాది పచ్చడిలో దాగుంది. 


ఆరోగ్యానికి...
పచ్చడిలో వాడే ప్రతి పదార్థమూ మనల్ని ఆరోగ్య రీత్యా కాపాడుతుంది. ఈ కాలంలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా ఈ పచ్చడి మనకి శక్తిని అందిస్తుంది. ప్రకృతిలో చోటు చేసుకున్న మార్పులను మనం మన శరీరం తట్టుకునే విధంగా ఈ పచ్చడి సిద్ధం చేస్తుంది. వేప పువ్వు, మామిడికాయలు, బెల్లం, చింతపండు వంటివి తినడం వల్ల అనేక సమస్యలు దరి చేరవు. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా లభిస్తుంది. వేపలో ఉండే చేదు గుణం వల్ల శరీరంలో ప్రవేశించే వైరస్‌లు ఎక్కువ కాలం బతకలేవు. దీనిలో వాడే బెల్లం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పిత్త, వాత సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో కొత్త కణాలు ఏర్పడేందుకు సహాయపడుతుంది. అందుకే పచ్చడిలో పంచదారను వాడకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే గుణం బెల్లానికి తక్కువ. పులుపు కోసం చింతపండును వాడతాము. ఈ చింతపండు మన శరీరంలోని జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య రాకుండా కాపాడుతుంది. మామిడికాయను వగరు రుచి కోసం పచ్చడిలో కలుపుతారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లక్షణాలు రాకుండా కాపాడుతుంది. పేగులకు మామిడికాయ ఎంతో మేలు చేస్తుంది. 


ఉగాది పచ్చడికి తయారీ ఇలా...
1. మిరపకాయను, బెల్లాన్ని, మామిడికాయను తురుముకోవాలి. 
2. వేప పూవును నీళ్లలో కడిగి శుభ్రం చేసుకోవాలి. 
3. చింతపండును కాస్త నీళ్లలో నానబెట్టాలి. 
4. చింతపండు పిప్పిని తీసి పడేసి ఆ రసాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. 
5. ఆ చింతపండు నీళ్లలో ఉప్పు, మామిడి తురుము, బెల్లం తురుము, పచ్చి మిరపకాయ తురుము,వేపపువ్వు తురుము వేసి కలుపుకోవాలి. 
6. వేప పువ్వును అధికంగా వేయకూడదు. చేదు ఎక్కువైపోతుంది. 
7. మీకు కావాలనుకుంటే కొబ్బరి ముక్కలు, అరటి పండు ముక్కలు, జామ ముక్కలు కూడా కలుపుకోవచ్చు.