రోజూ ఆనందం కోసం మద్యం తాగేవారు కొంతమంది. మరికొంతమంది బాధల్ని మరిచిపోవడానికి తాగుతామని చెబుతారు. పనిఒత్తిడిని తగ్గించుకోవడానికే మద్యం తాగుతామని అంటారు. నిజానికి ఒత్తిడిలో మద్యం తాగడం చాలా ప్రమాదకరం. మీకు ఇది సాయం చేయదు, సరికదా సమస్యను మరింత తీవ్రంగా మార్చేస్తుంది. వెచ్చని మద్యం శరీరంలో చేరితే తెలియని మత్తులో తేలిపోతారు. ఇక రక్త నరాల్లోకి ప్రవహిస్తే స్వర్గంలో ఉన్నట్టు ఫీలవుతారు. ఆ కిక్కు కోసమే చాలా మంది మద్యానికి బానిసలుగా మారి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు మద్యాన్ని తాగితే ఇతర అనారోగ్యాలు వచ్చ అవకాశం ఉంది.
ఒత్తిడిలో మద్యం తాగితే కొన్ని విపరీత లక్షణాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే...
మానసిక కల్లోలం
హఠాత్తుగా కోపం
ఫోకస్ చేయడంలో ఇబ్బంది
బ్లాక్అవుట్
పెరిగిన ఒత్తిడి , ఆందోళన
పానిక్ అటాక్
నిద్రలేమి
లైంగిక కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం
ఆకలి లేకపోవడం
ఆల్కహాల్ వల్ల మానసిక సమస్యలు
ఆల్కాహల్ మానసికంగా సమస్యలను మరింత పెంచేస్తుంది. అంతేకాదు కొత్త అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఆల్కహాల్ వల్ల వచ్చే ఏ మానసిక సమస్యకు చికిత్స లేదు. అందుకే వాటి బారిన పడకుండా ఉండడమే మంచిది. ఆల్కహాల్ వల్ల వచ్చే మానసిక రుగ్మత, స్లీపింగ్ డిజార్డర్, డిప్రెసివ్ డిజార్డర్, యాంగ్జయిటీ... ఇవన్నీ కలుగుతాయి.
ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి
వ్యాయామం
రోజూ వ్యాయామం చేయాలి. జిమ్ కి వెళ్లడం లేదా ఒక కిలోమీటరు నడవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్లడం కూడా చాలా మేలు చేస్తుంది.
ధ్యానం
ధ్యానం, యోగ, ప్రాణాయామం వంటి శ్వాస ఆధారిత వ్యాయామాలు చేయడం కూడా చాలా ముఖ్యం. ఇవి మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుతాయి. మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.
మీ సమయం...
జీవితం చాలా బిజీ అయిపోయింది. రోజులో 24 గంటలు సరిపోవడం లేదు. అయినా మీకంటూ మీరు కొంత సమయాన్ని వెచ్చించుకోవాలి. ఆ సమయంలో మీకు నచ్చిన పనిని చేసుకోవాలి. లేకుంటే మానసికంగా ఇంకా కుంగిపోతారు. పుస్తకాలు చదవడం, ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా నిద్రపోవడం ఇలా ఏదైనా చేయాలి.
డైరీ రాసే అలవాటు ఉంటే ఇంకా మంచిది. మీ మనసులోని భావాలన్నీ డైరీలో రాసేస్తే భారం తగ్గిపోతుంది. మీ మెదడు, మనసు తేలికగా మారుతాయి.
Also read: తెలంగాణ ఫేమస్ వంటకం సర్వపిండి, ఇలా చేస్తే టేస్టు అదిరిపోతుంది
Also read: వాయిదా వేసే అలవాటుంటే చాలా ప్రమాదం, భవిష్యత్తులో డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.