Asia cup 2022, Hongkong Cricket Team Journey: ఆసియా కప్ లో ఎప్పుడూ భారత్, పాకిస్థాన్, శ్రీలంక ఈ మూడు జట్లదే హవా. ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లను మినహాయిస్తే  హాంకాంగ్ ను ఓ పోటీగా కూడా ఎవరూ పట్టించుకోరు. అఫ్ కోర్స్ ఈ సారి ఆసియా కప్ లో భారత్ తో ఆడిన మ్యాచ్ లో మంచి ఫైటే ఇచ్చిన హాంకాంగ్..పాకిస్థాన్ చేతిలో మాత్రం 38 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సరే అనుభవం లేని జట్టు కదా మెల్లగా నేర్చుకుంటారు లే అని హాంకాంగ్ పై ఎవరూ జాలి చూపించటం లేదు. పైగా అంతా వాళ్ల కమిట్మెంట్ ను అంతా ప్రశంసిస్తున్నారు. ఎస్ నిజం బీసీసీఐలా ధనిక బోర్డు కాదు హాంకాంగ్ ది. అసలు ఆ టీమ్ లోని ప్లేయర్ల నేపథ్యం ఏంటో తెలుసుకుంటే వాళ్లందరూ కలిసి జట్టులా ఎలా ఆడుతున్నారని ఆశ్చర్యం కలగకుండా ఉండదు.


ఒక ప్లేయర్ ది ప్రైవేట్ కోచింగ్, మరో ప్లేయర్ ఫుడ్ డెలివరీ బాయ్, ఇంకోడు బంగారం షాపులో పనిచేస్తాడు. మరొక కుర్రాడు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్నాడు. ఇలా హాంకాంగ్ క్రికెట్ ప్లేయర్లలో ఎవరి బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నా చాలా సాధారణ జీవితాలు. బతుకు తెరువు కోసం రకరకాల పనులు చేసే వాళ్లు. పెద్దగా మ్యాచ్ ఫీజులు లేకున్నా.. విదేశాలకు వెళ్లేందుకు స్పాన్సర్లు దొరక్కున్నా కిందామీదపడి మ్యాచ్ లు ఆడుతున్న తీరే అసలు సిసలు ప్రొఫెషనలిజం చూస్తుంటే  గూస్ బంప్స్ రాక మానవు.  


గడచిన మూడు నెలలుగా హాంకాంగ్ క్రికెట్ టీం అలుపెరగకుండా క్రికెట్ టోర్నమెంట్స్ ఆడుతూనే ఉంది. హాంకాంగ్ క్రికెటర్లు బాబర్ హయాత్, ఈషన్ ఖాన్, యాసిం ముర్తజాలకు ఈ మధ్యే పిల్లలు పుట్టారు. అది కూడా ఫస్ట్ చైల్డ్. బట్ ఇంటికి వెళ్లి వాళ్లను కళ్లారా చూసుకోలేని పరిస్థితి. దేశం కోసం ఆడాలి...క్రికెటర్లుగా నిరూపించుకోవాలి ఇదే కసి అందుకే తమ ప్రేమను కేవలం వీడియో కాల్స్ రూపంలో చూసుకుంటూ చూపిస్తూ క్రికెట్ ఆడుతున్నారు ఈ డైనమైట్స్.


హాంకాంగ్ హెడ్ కోచ్ ట్రెంట్ జాన్ స్టన్ బయటి ప్రపంచానికి చెప్పెవరకూ హాంకాంగ్ ప్లేయర్ల  ఈ ఇన్ స్పైరింగ్ జర్నీ ఎవరికీ తెలీదు. రెండేళ్ల పాటు కరోనా కారణంగా క్రికెట్ ఆడే అవకాశం లేనప్పుడు బతకటం కోసం వాళ్లు తిప్పలు అంతా ఇంతా కాదట. హాంకాంగ్ లో మొత్తం ఆరు లాక్ డౌన్లు పెట్టారు. ఏడాది పాటు క్రికెట్ ట్రైనింగ్ లేదు. అయినా వాళ్ల ఫిజికల్ ఫిట్నెస్ కోసం లోకల్ పార్కుల్లో పరుగులు పెట్టారంట. మంచిరోజులు వస్తాయని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారంట. బోర్డు ఫీజులు ఇవ్వలేమంటే డెలివరీ బాయ్స్ గా, దుకాణాల్లో పనివాళ్లుగా చేతికి దొరికిన పని చేసుకుంటూ మళ్లీ క్రికెట్ ఆడే రోజు కోసం నమ్మకంగా ఎదురుచూశారని జాన్ స్టన్ చెప్పుకొచ్చారు.


యూఏఈలో ఆసియా కప్ కోసం రాకముందు జింబాబ్వేలో టీ20వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఆడారు. బ్యాడ్ లక్ అక్కడ హాంకాంగ్ టీమ్ ఫెయిలైంది. టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇండియా, పాకిస్థాన్ తో ఆడాలనే వాళ్ల కలను ఆసియా కప్ లో నెరవేర్చుకున్నారు. పాకిస్థాన్ లో బాబర్ అజమ్ ను కలిసి బ్యాటింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకోవాలని ఎంత ఆరాటపడ్డారో..కష్టకాలంలో ఉన్న విరాట్ కొహ్లీకి తామెంత పెద్ద అభిమానులమో చెప్పి ఇన్ స్పైర్ చేయాలని అంతలా ఎదురుచూశారు. చివరికి ఆ మూమెంట్స్ చాలా ఎంజాయ్ చేశారు. హాంకాంగ్ టీమ్ తరపున ఓ జెర్సీపై విరాట్ కొహ్లీకోసం ప్రేమసందేశం రాశారు. తమ లాంటి చిన్న టీమ్స్ ని క్రికెట్ ఆడాలని ఎంతో ఇన్ స్పైర్ చేసిన విరాట్ కొహ్లీ కోసం ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలని...పర్టిక్యులర్ గా ఈ లో టైం లో కొహ్లీకి  హాంకాంగ్ మద్దతుగా నిలబడుతుందని జెర్సీ పై రాసి కొహ్లీకి ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  కొహ్లీ కూడా హాంకాంగ్ ఇచ్చిన నైస్ గెస్చర్ కి ఎంతగానో మురిసిపోయి తన స్టేటస్ లో పెట్టుకున్నాడు.  అంతే కాదు హాంకాంగ్ ప్లేయర్ కించిత్ తన గర్ల్ ఫ్రెండ్ కి ఆసియా కప్ లోనే ప్రపోజ్ చేశాడు. ఆమె ఎస్ అంది కూడా. సో మొత్తంగా వ్యక్తిగతంగా వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా క్రికెట్ పరంగా మాత్రం పక్కా ప్రొషెషనల్స్ గా వ్యవహరించి హృదయాలను గెలుచుకుంది హాంకాంగ్ క్రికెట్ టీమ్.