పులిపిర్లు చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య.చేతులు, కాళ్లపై ఉంటే ఎవరూ పట్టించుకోరు కానీ ముఖంపై వస్తే మాత్రం వాటిని అలా గిల్లుతూ ఉంటారు, వాటిని ఎలాగైనా తొలగించుకోవాలనుకుంటారు. ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే పులిపిర్లు వచ్చేది కూడా వైరస్ వల్లే. ఆ వైరస్ వల్ల వచ్చే ఒక చర్మ ఇన్ఫెక్షన్ పులిపిర్లు. ఈ వైరస్ పేరు ‘హ్యూమన్ పాపిలోమా’. ఇది చర్మం మీద దెబ్బలు, లేదా మొటిమలు వచ్చినప్పుడు ఆ సందుల్లోంచి చర్మంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ వైరస్ తిష్ట వేసుకుని కూర్చుని అదనపు కణాలు ఒకేచోట పెరిగేలా చేస్తుంది. ఆ కణాలన్నీ చర్మం వెలుపలకు పెరిగి గట్టిపడి పోతాయి. అవే పులిపిర్లుగా మారుతాయి. వీటిని ‘వాట్స్’ అని పిలుస్తారు. ఇవి ఎలా పోతాయో తెలియక చాలా మంది చేత్తో గిల్లుతూ ఉంటారు. అలా గిల్లడం సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు. 


చికిత్స...
పులిపిర్లను తీయించుకోవాలనుకుంటే డెర్మటాలజిస్టును సంప్రదించాలి. రేడియో ఫ్రీక్వెన్సీతో వాటిని కత్తిరిస్తారు. కొన్ని పులిపిర్లు కాయల్లా కాకుండా, బల్లపరుపుగా ఉంటాయి అలాంటి వాటికి మాత్రం క్రయోథెరపీ చికిత్స చేయాల్సి వస్తుంది. ఈ చికిత్సలో భాగంగా లోపలున్న వైరస్ను చంపేస్తారు. మైనస్ 67 డిగ్రీల ద్రవ నత్రజనిని పంపించి వైరస్ గడ్డకట్టేలా చేస్తారు. వైరస్ చనిపోయాక ఆ ప్రాంతంలో చర్మం పై పొరతో సహా వైరస్‌ను తీసి పడేస్తారు. ఆ వైరస్ పొరపాటున గొంతులోకి చేరిందంటే గొంతులో కూడా పులిపిర్లు వచ్చేస్తాయి. అందుకే చికిత్స చేస్తున్నప్పుడు ముక్కు ద్వారా వైరస్ చేరకుండా చూసుకుంటారు. మళ్లీ వైరస్ పెరగకుండా వాటితో పోరాడేందుకు కొన్ని రకాల మందులు ఇస్తారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం పొడి బారకుండా చూసుకోవాలి. పొడి చర్మం కలవారికే పులిపిర్లు వచ్చే అవకాశం ఎక్కువ.


ఒకరి నుంచి ఒకరికి...
చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే పులిపిర్లు అంటు వ్యాధి. ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. పులిపిర్లు ఉన్న వారు వాటిని ముట్టుకుని ఏదైనా వస్తువును తాకితే, ఆ వస్తువును తాకిన వారికి పులిపిర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పులిపిర్లు ఉన్న వారితో సామాజిక దూరం పాటించాలి. ఆయుర్వేదంలో కూడా వీటికి చికిత్స ఉంది. మేడి చెట్టు నుంచి వచ్చే పాలను తీసి ఈ పులిపిర్లకు రాయాలి. ఆ పాలు వైరస్‌ను నాశనం చేస్తుంది.   


Also read: రోజూ వేడి నీటి స్నానం చేసే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందా? వైద్యులు చెబుతున్నదిదే































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.