పరాయి పాలనలో మగ్గి... ప్రాణాలకు తెగించి పోరాడి మరీ స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. కానీ మనల్ని మనం పాలించుకోవడానికి ఒక దిశా నిర్దేశం కావాలి. ప్రతి దేశానికి సొంత రాజ్యాంగం ఉన్నట్టే మనకీ అవసరం. ఆ పనిని అంబేద్కర్‌కు అప్పగించారు పెద్దలు. రాజ్యాంగం పూర్తయ్యాక 1949లో నవంబర్ 26న ఆమోదం పొందింది. అయితే దీన్ని అమలులోకి తెచ్చేందుకు ఒక ప్రత్యేకమైన రోజు అవసరమని  భావించారు. అందుకోసం ‘జనవరి 26వ’ తేదీని ఎంచుకున్నారు. అలా 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చి భారతదేశాన్నిసర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్రరాజ్యంగా మార్చారు. 


జనవరి 26 తేదీనే ఎందుకు?
రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించినప్పటికీ వెంటనే అమలు చేయకుండా జనవరి 26వ తేదీ వరకు ఎందుకు ఆగారు? ఆ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? ఆ తేదీకి స్వాతంత్య్రోద్యమంలో చారిత్రక స్థానం ఉంది. బ్రిటిష్ వారిపై తిరుగుబాటులో భాగంగా 1930, జనవరి 26న జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్‌ని (సంపూర్ణ స్వాతంత్య్రం) ఆరోజే ప్రకటించింది. లాహోర్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. రావి నది ఒడ్డున నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ‘భారతీయులకు స్వేచ్ఛ కావాల్సిందే, మా దేశాన్ని మాకు అప్పగించి మీరు దేశాన్ని వీడాల్సిందే’ అని బ్రిటిషర్లకు తమ  ఉద్యమతీవ్రతను అర్థమయ్యేలా చేశారు. ఏదో సామంత దేశంగా మిగిలిపోవడం మాకు ఇష్టం లేదని, పూర్తిగా మా దేశాన్ని మాకు అప్పగించాల్సిందేనని ఆ రోజే గట్టిగా నినదించారు.  అప్నట్నించి  జనవరి 26ను కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవంగా వ్యవహరించి వేడుకలు నిర్వహించుకునేవారు. అయితే మనకు బ్రిటిష్వారు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం ప్రకటించడంతో జనవరి 26 చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు నెహ్రూ, ఇతర నేతలు. ఆ రోజు చిరస్థాయిగా నిలిచిపోవాలనే కోరికతో గణతంత్ర దినోత్సవంగా చేశారు. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950, జనవరి 26న తుపాకుల వందనంతో జెండా ఎగురవేసి మొదటి గణతంత్రదినోత్సవ వేడుకలను ప్రారంభించారు.  


స్వాతంత్య్ర దినోత్సవంలాగే గణతంత్ర దినోత్సవం కూడా జాతీయ సెలవుదినంగా ప్రకటించారు. దేశరాజధానిలో విశాలమైన గ్రౌండ్ లో వివిధ రాష్ట్రాల శకటాలు పరేడ్ లో పాల్గొంటాయి. సైనిక, వాయు, నౌకా దళాలకు చెందిన మహిళదళాలు రాజ్‌పథ్ కవాతు చేస్తాయి. యుద్ధవిమానాలు కూడా పరేడ్ లో పాల్గొంటాయి. 


Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..


Also Read: కన్నార్పకుండా చూసేలా గణతంత్ర వేడుకలు.. ఈ సారి ఎన్నెన్ని విశేషాలో తెలుసా..?