పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు నీరసంగా, శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో జంక్ ఫుడ్, చిప్స్, చాక్లెట్లు తినాలని అనిపిస్తుంది. వాటిని తినడం వల్ల పొట్ట అయితే నిండుతుంది కానీ ఆరోగ్యం మాత్రం ఇబ్బందుల్లో పడుతుంది. శరీరం కోల్పోయిన ద్రవాలు శక్తి తిరిగి నింపేందుకు వాటికి బదులు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇవి తినడం వల్ల పొట్ట నిండుతుంది, శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం. ఇంట్లో వండిన సమతుల్య భోజనంతో పాటు ద్రవపదార్థాలు తీసుకోవాలి. సూప్, స్మూతీస్, మజ్జిగ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సాధారణ కార్బోహైడ్రేట్స్ త్వరగా శక్తిని అందిస్తాయి. పండ్లు, గింజలల్లో సాధారణ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి. శక్తి తక్కువగా ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనసు గందరగోళంగా ఉంటుంది. ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయి. ఒక్కోసారి మైండ్ సరిగా పనిచేయక తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావొచ్చని అంటున్నారు. అందుకే తక్షణ శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఎప్పుడు ఇంట్లో ఉంచుకొనేలా చూసుకోవాలి. ఇవి తక్కువ కేలరీలు, పోషకాలతో నిండి ఉంటాయి. ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.
తక్షణ శక్తి ఇచ్చే పదార్థాలు
నారింజ: ఎనర్జీని ఇచ్చే వాటిలో నారింజ ముందు ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పోషకాల పవర్ హౌస్. శరీర పనితీరు కోసం అవసరమైన భాస్వరం, ఖనిజాలు, ఫైబర్ ఇందులో లభిస్తాయి.
కొబ్బరినీళ్ళు: శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి తక్షణ శక్తిని పొందటానికి కొబ్బరి నీళ్ళు ఉత్తమమైన పానీయాల్లో ఒకటి. వేడిని ఎదుర్కొంటుంది. ఇవి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. జ్వరం, అతిసారంతో ఇబ్బంది పడుతున్నప్పుడు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శక్తి వస్తుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.
ఖర్జూరాలు: సహజ చక్కెర కలిగిన గొప్ప మూలం. తక్షణ శక్తిని అందించే పదార్థాల్లో ముందుంటుంది. వ్యాయామం తర్వాత లేదా అలసటగా అనిపించినప్పుడు ఇవి తీసుకోవడం వల్ల స్టామినా పెరుగుతుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం జింక్, ఐరన్ ఉంటాయి.
అరటి పండ్లు: శరీరానికి శక్తినిచ్చే పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. అందుకే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ తినని వాళ్ళు పొద్దునే ఒక అరటిపండు తింటారు. అరటిపండ్లలో చక్కెర, ఫైబర్, విటమిన్ B6 ఉంటాయి. ఇది మానసిక స్థితిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అవి మీ మానసిక స్థితిని తక్షణమే ఉత్తేజపరిచేందుకు సహకరిస్తుంది. దీని తీసుకోవడం వల్ల మీరు రిఫ్రెష్ అనుభూతిని పొందుతారు.
నువ్వులు: మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. చక్కెర స్థాయిలని ఎనర్జీగా మార్చగలుగుతాయి.
నిమ్మకాయ నీళ్ళు: నిమ్మకాయలో పొటాషియం మెదడు నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. కణాలకి ఆక్సిజన్ నడుస్తుంది. శక్తి స్థాయిలని మెరుగుపరుస్తుంది.
ఇవే కాకుండా ప్రాసెస్ చేయని ఆహారాలు, సీజనల్ పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, నట్స్, తృణధాన్యాలు కూడా అలసటతో పోరాడటానికి రోజంతా శక్తివంతంగా ఉండేందుకు సహకరిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: కాలేయ వాపు వల్ల మెదడు దెబ్బతింటుందా? ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?