జీవక్రియలో ముఖ్య పాత్ర వహించేది కాలేయం. శరీరానికి అవసరమైన మేరకు కొవ్వుని నిల్వ చేసుకుంటుంది. ఒక్కోసారి కాలేయం సరిగా పనిచేయకపోతే కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. ఇది ఫ్యాటీ లివర్ సమస్యకి దారి తీస్తుంది.  అయితే ఇది కాలేయాన్ని మాత్రమే కాదు మెదడుని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మెదడు పనితీరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్నే హెపాటిక్ ఎన్సెఫలోపతి లేదా HE అని కూడా పిలుస్తారు. ఈ సమస్య కాలేయం రక్తం నుంచి విష వ్యర్థాలని తొలగించలేనప్పుడు సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.


మయో క్లినిక్ ప్రకారం ఇదొక నాడీ వ్యవస్థ రుగ్మత. కాలేయంలోని టాక్సిన్స్ మెదడుకు వెళ్ళి దాని పనితీరుని ప్రభావితం చేసినప్పుడు జరుగుతుంది. హెపాటిక్ ఎన్సెఫలోపతి ఉన్న వ్యక్తులు దీర్ఘకాలిక తీవ్రమైన గందరగోళం, అభిజ్ఞా క్షీణత వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలేయ వ్యాధి అభివృద్థి చెందుతున్నప్పుడు పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. సమయానికి స్పందించి చికిత్స తీసుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. దీని వల్ల కాలేయం దెబ్బతిన్న తర్వాత మెదడు పనితీరు మందగిస్తుందనేందుకు కొన్ని సంకేతాలు చూపిస్తుంది. అవేంటంటే..


⦿ డీహైడ్రేషన్


⦿ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా తీసుకోవడం


⦿ పొటాషియం, సోడియం స్థాయిలు పడిపోవడం


⦿ పేగుల్లో, కడుపులో రక్తస్రావం


⦿ ఇన్ఫెక్షన్స్


⦿ కిడ్నీ సమస్యలు


⦿ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం


HE వల్ల ఎలాంటి వాళ్ళు ప్రమాదంలో పడతారు?


కాలేయ సిర్రోసిస్ తో బాధపడుతున్న దాదాపు 50 శాతం మంది వ్యక్తులు హెపాటిక్ ఎన్సెఫలోపతి లక్షణాలను అనుభవిస్తారు. ఫ్యాటీ లివర్ బాధితులు కూడా చికిత్స సరిగా తీసుకోకపోతే దీని బారిన పడే ప్రమాదం ఉంది. సిర్రోసిస్ అంటే కాలేయంలో మచ్చ కణజాలం పేరుకుపోవడమే. ఈ మచ్చ కణజాలం రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. టాక్సిన్స్, హార్మోన్లు, పోషకాలని ఫిల్టర్ చేసే కాలేయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.


హెపాటిక్ ఎన్సెఫలోపతి రకాలు


హెల్త్‌లైన్ ప్రకారం హెపాటిక్ ఎన్సెఫలోపతిలో మూడు రకాలు ఉన్నాయి.


టైప్ A లేదా అక్యూట్ ఫుల్మినెంట్ వైరల్ హెపటైటిస్: ఇది తీవ్రమైన కాలేయ వైఫల్యం వల్ల వచ్చే వైరల్ హెపటైటిస్ రకం.


టైప్ B లేదా టాక్సిక్ హెపటైటిస్: కాలేయం లోపల రెండు సిరలను కలిపే షంట్ ఉన్నవారిలో ఇది జరుగుతుంది. ఆల్కహాల్, కెమికల్స్, డ్రగ్స్ ఎక్కువగా తీసుకునే వ్యక్తులలో ఇది జరుగుతుంది.


టైప్ C లేదా రేయ్స్ సిండ్రోమ్: దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, సిర్రోసిస్ తో బాధపడే వారిలో కలిగే అరుదైన పరిస్థితి.


ఈ వ్యాధి లక్షణాలు


⦿ చిరాకు, ఆందోళన


⦿ మతిమరుపు


⦿ ఏకాగ్రత లోపం


⦿ చేతులు కదిలించడంలో ఇబ్బంది


⦿ మూడ్ స్వింగ్స్


⦿ కండరాలు మెలి తిరగడం


⦿ నిద్రలేమి


⦿ మాటల్లో తడబాటు


ఎలా నివారించాలి?


కాలేయ వ్యాధులను నయం చేసేందుకు విజయవంతమైన మార్గాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది హెపాటిక్ ఎన్సెఫలోపతిని అభివృద్ధి చేసే అవకాశాలని తగ్గిస్తుంది.


☀ మద్యం సేవించడం మానేయాలి


☀ పెయిన్ కిల్లర్స్, యాంటీ దీప్రెసెంట్స్ తీసుకోవడం మానుకోవాలి లేదంటే నాడీ వ్యవస్థని ప్రభావితం చేస్తాయి.


☀ సమతుల్య, పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి


☀ బరువు అదుపులో ఉంచుకోవాలి


☀ మందులు సమయానికి తీసుకోవాలి


☀ క్రమం తప్పకుండా కాలేయ పనితీరు పరీక్షలు చేయించుకోవాలి


☀ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మానేయాలి


☀ హెపటైటిస్ ఏ, బి టీకాలు వేసుకోవాలి


☀ గుడ్లు, రెడ్ మీట్, చేపలు మొదలైన అధిక ప్రోటీన్ ఆహారాలకి దూరంగా ఉండాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మాస్క్ పెట్టకపోతే మెదడు మటాష్ - ఆ ఒమిక్రాన్ వేరియెంట్‌తో ఆ ముప్పు తప్పదా? ఏది నిజం?