Chinese Jet - US Aircraft: అమెరికా- చైనా మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. దక్షిణ చైనా సముద్రం విషయంలో ఈ రెండు దేశాల మధ్య ఎప్పటినుంచో మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా చైనా మరింత దూకుడుగా వ్యవహరించింది. ఈ సముద్రంపై ప్రయాణిస్తున్న అమెరికా నిఘా విమానాన్ని డ్రాగన్ ఫైటర్ జెట్ దాదాపు ఢీకొట్టబోయింది. ఈ విషయాన్ని అమెరికా సైన్యం వెల్లడించింది.
ఇదీ జరిగింది
అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిఘా విమానం ఆర్‌సీ-135 విమానానికి అత్యంత సమీపంలోకి చైనా యుద్ధ విమానం దూసుకొచ్చినట్లు యూఎస్ మిలిటరీ వెల్లడించింది. ఈ ఘటన గురించి యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
డిసెంబరు 21న దక్షిణ చైనా సముద్రంపై అమెరికా నిఘా విమానం ప్రయాణించింది. ఆ సమయంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన జే-11 యుద్ధ విమానం.. అమెరికా విమానానికి ఎదురుగా 6 మీటర్ల (20 అడుగులు) దూరం వరకు దూసుకొచ్చిందని అమెరికా వెల్లడించింది.
యూఎస్ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఢీకొనే ప్రమాదాన్ని తప్పించినట్లు తెలిపింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో చట్టపరంగానే తాము సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అమెరికా ఈ సందర్భంగా పేర్కొంది. అయితే అమెరికా ప్రకటనపై చైనా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
హక్కు లేదు
దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ చైనా వెనక్కి తగ్గట్లేదు. అమెరికా ఈ సముద్రంలో యుద్ధ నౌకలు, విమానాలను మోహరించడంతో చైనా తీవ్ర ఆగ్రహంగా ఉంది. వాటిని వెంటనే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని చైనా డిమాండ్ చేస్తూనే ఉంది. కానీ వాటిని పట్టించుకోని అమెరికా.. దక్షిణ చైనా సముద్రంలో నిరంతరంగా కార్యకలాపాలు సాగిస్తూనే ఉంది. దీని కారణంగానే ఏకంగా అమెరికా నిఘా విమానాన్ని ఢీ కొట్టేందుకు చైనా సాహసించింది.
Also Read: Pant Car Accident: పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్