YSR Kadapa Crime News: 14 ఏళ్ల క్రితం ఓ మహిళ... యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా నలుగురు పిల్లలు కూడా పుట్టారు. అయితే కొన్నాళ్ల క్రితం నుంచి ఆమెకు భర్తపై ప్రేమ తగ్గిపోయింది. ఈ క్రమంలోనే మరో యువకుడి పరిచయం ప్రేమగా, వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి ఇద్దరు పిల్లలను తీసుకొని పారిపోయారు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే బాబు చిన్నవాడు కావడం, రాత్రిళ్లు తరచుగా ఏడుస్తుండటంతో.. తమకు ఏకాంతంగా గడిపే సమయం దొరకట్లేదని పిల్లాడిపై కోపంగా ఉన్నారు. అయితే ఓరోజు బాబు మరింత ఏడ్వడంతో కోపం పట్టలేని ప్రయుడి బాబుని కొట్టి చంపేశాడు. ఆపై ఇంటి ఆవరణలోనే గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి పెట్టేశారు. చివరకు పోలీసులకు చిక్కారు. 


అసలేం జరిగిందంటే..?


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన మారుతి నాయక్ లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఇతను 14 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన కవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టారు. వీరి కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ ఇటీవలే ఖాజీపేటలోని చెమ్మళ్లపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. లారీ డ్రైవర్‌గా పని చేసే మారుతి నాయక్ అదే వృత్తిలో ఉండే వినోద్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. తరచుగా వినోద్ వీరి ఇంటికి వస్తుండటంతో... కవితకు కూడా అతడితో స్నేహం పెరిగింది. ఈ స్నేహమే.. ప్రేమ, వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం వినోద్, కవితలు ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి పరారయ్యారు. కొద్ది రోజుల పాటు అక్కడక్కడా తిరుగుతూ.. మూడు నెలల క్రితం బద్వేలులోని రూపంరాం పేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు.


భర్త వెళ్లి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పిన కవిత


ఇద్దరు పిల్లలు, భార్య కనిపించకుండా పోవడంతో మారుతి నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. కవిత, వినోద్ బద్వేల్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని భర్త మారుతి నాయక్ కు చెప్పగా.. తన సోదరితో కలిసి కవిత ఇంటికి వెళ్లారు. విషయం గుర్తించిన వినోద్ అక్కడి నుంచి పరారయ్యాడు. పిల్లలను తీసుకొని నువ్వెందుకు వచ్చావని భర్త ప్రశ్నించగా అసలు విషయం తెలిపింది. ఆపై పాప ఒక్కతే కనిపిస్తోంది.. బాబు ఎక్కడని ప్రశ్నించగా... కవిత పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన మారుతి నాయక్ బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అర్బన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


ఏకాంతానికి అడ్డొస్తున్నాడని.. బాబు హత్య


అయితే 15 రోజుల క్రితం బాబు రాత్రి పూట ఎక్కువగా ఏడ్వడంతో.. తమ ఏకాంతానికి అడ్డుగా వస్తున్నాడని భావించిన వినోద్ రెండేళ్ల బాలుడి విపరీతంగా కొట్టాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే బాలుడు దెబ్బలను తట్టుకోలేక చనిపోయాడని.. దీంతో ఇద్దరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే కవితను అదుపులోకి తీసుకొని వినోద్ కోసం గాలిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి, బాలుడు ఎలా చనిపోయాడో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.