Myanmar Aung San Suu Kyi:


మరో ఏడేళ్లు..


మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీకి మరో ఏడేళ్ల పాటు జైలు శిక్షను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మయన్మార్ కోర్ట్. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చాన్నాళ్లుగా జైల్లోనే ఉంటున్నారు సూకీ. ఇప్పుడు మరో ఏడేళ్ల పాటు ఆమె కటకటాల్లోనే ఉండాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. హెలికాప్టర్ల కొనుగోళ్ల విషయంలో ఆమె అవినీతికి పాల్పడ్డారని సైన్యం ఆరోపిస్తోంది. తనపై వచ్చిన ఆరోపణల్ని ఆమె కొట్టి పారేస్తున్నప్పటికీ...సైన్యం మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. మయన్మార్ సైనిక పాలనలోకి వెళ్లిన వెంటనే ఆమెను జైల్లో పెట్టారు. ఆమె బయటకు రాకుండా పూర్తిగా జైల్లోనే ఉంచి...సైనిక పాలననే కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించనుంది మయన్మార్ సైన్యం. 2021 ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్...సైనిక పాలనలోకి వెళ్లింది. అప్పుడే కీలక నేతలందరినీ కస్టడీలోకి తీసుకుంది సైన్యం. అందులో భాగంగానే ఆంగ్‌సాన్ సూకీని జైల్లో పెట్టారు. అప్పటి నుంచి ఆమె అలా మగ్గుతూనే ఉన్నారు. 






26 ఏళ్లు పొడిగింపు..! 


నిజానికి...సూకీకి జైలు శిక్షను 26 ఏళ్ల వరకూ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆ దేశ న్యాయస్థానం. గతంలోనే మయన్మార్ సైనిక ప్రభుత్వం సూకిపై 11 అవినీతి కేసులు మోపింది. ఇప్పుడు ఇతర కారణాలు చెబుతూ...మొత్తంగా ఆమె 26 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గిపోయేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఏడేళ్లు పొడిగించారు. డ్రగ్ ట్రాఫికింగ్ చేసే మౌంగ్ వీక్ నుంచి 550,000డాలర్ల లంచం తీసుకున్నారని ఆమెపై ఆరోపణలు మోపింది సైనిక ప్రభుత్వం. ఈ ఆరోపణలు ఆమె ఖండించినప్పటికీ...లాభం లేకుండా పోయింది. ఇప్పుడు మరికొన్ని అభియోగాలు చేస్తూ...అన్నింటికీ కలిపి 26 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాలని తేల్చి చెప్పింది. దీనిపై సూకీ మద్దతుదారులు మండిపడుతున్నారు. ఆమెపై కక్ష తీర్చుకునేందుకే ఈ తీర్పునిచ్చారని, 2023లో జరిగే ఎన్నికల్లో  ఆమె పోటీ చేయకుండా ఉండేందుకు  కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సూకిపై 11 అవినీతి కేసులను సైనిక ప్రభుత్వం మోపింది. ఈ కేసు విచారణలో భాగంగా జుంటా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్ల నగదు, 11.4 కిలోల బంగారాన్ని సూకీ లంచం రూపంలో తీసుకున్నట్టు కోర్టు పేర్కొంది. దీంతో సూకీకి ఐదేళ్లపాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది.


అయితే, సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కేసు మాత్రమే. మిగిలిన 10 కేసుల్లో కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే మరింత శిక్షపడే అవకాశం ఉందని అప్పుడే అంచనా వేశారు. ఇప్పుడదే నిజమైంది. తిరుగుబాటు ద్వారా సూకీకి, రాజ్యాంగ సవరణలకు సైన్యం కళ్లెం వేసింది. అనంతరం దేశాన్ని హస్తగతం చేసుకొని సూకీని జైల్లో పెట్టింది. ప్రజానేత ఆంగ్‌ సాన్‌ సూకీ 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆమె మయన్మార్‌లో సైనిక పాలన నిర్మూలన కోసం పోరాటం చేశారు. ఆంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.


Also Read: Heeraben Modi Profile: అమ్మ చిన్నతనమంతా పేదరికమే, పక్కింట్లో అంట్లు కడిగి మమ్మల్ని పోషించింది - ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ