Heeraben Modi Profile:


ఆరుగురు సంతానం..


ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లి హీరాబెన్ మోడీ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు చాలానే చూశాం. కానీ...ఆమె గురించి మనకు తెలిసింది తక్కువే. పలు సందర్భాల్లో ప్రధాని తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఎంత కష్టపడి పెంచిందో వివరించారు. గుజరాత్‌లోని మెహ్‌సనాలో 1922 జూన్ 18న హీరాబెన్ మోడీ జన్మించారు. టీ అమ్ముతూ జీవనం సాగించే దామోదర్‌దాస్ మూల్‌చంద్ మోడీతో చిన్న వయసులోనే వివాహమైంది. ఈ దంపతులకు ఆరుగురు సంతానం. ఐదుగురు కుమారులు, ఒక కూతురు. వీరు వరుసగా..అమృత్ మోడీ, పంకజ్ మోడీ, నరేంద్ర మోడీ, ప్రహ్లాద్ మోడీ, సోమా మోడీ, వసంతీ బెన్ హన్స్‌ముఖ్‌లాల్ మోడీ. వందేళ్ల వయసులోనూ హీరాబెన్ చాలా హుషారుగా కనిపించారు. ఎన్నికల సమయంలోనూ వీల్‌ఛైర్‌లో వెళ్లి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లోనూ క్యూలో నిలుచుని మరీ ఓటు వేశారు. ఆమె ఆ వయసులోనూ తానే స్వయంగా వండుకుని తినేవారు. 


త్యాగం చేసిన తల్లులెందరో: మోడీ 


2015లో ప్రధాని నరేంద్ర మోడీ ఫేస్‌బుక్ సీఈవో జుకర్ బర్గ్‌తో మాట్లాడిన సందర్భంలో తన తల్లి గురించి చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. "ఆమె ఇప్పటికీ తన పని తానే చేసుకుంటుంది. తనకు చదువు రాదు. కానీ వార్తలు రోజూ చూస్తుంది. ఏం జరుగుతోందో తెలుసుకుంటుంది. మా చిన్నతనంలో మమ్మల్ని పోషించేందుకు పొరుగింట్లో అంట్లు తోమేది. కాయకష్టం చేసేది. ఓ తల్లి తన పిల్లల కోసం ఎంత కష్టపడుతుందో అవన్నీ చేసింది. తన పిల్లల కలలు నెరవేర్చేందుకు జీవితాల్నే త్యాగం చేసిన అమ్మలెందరో ఉన్నారు" అంటూ ఎమోషనల్ అయ్యారు మోడీ. ఇటీవలే తన తల్లి 100వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన బ్లాగ్‌లో ఓ వ్యాసం కూడా రాశారు. "మా అమ్మ 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మా నాన్న బతికి ఉండుంటే ఆయన కూడా ఇలా 100వ పుట్టిన రోజు జరుపుకునే వారు. ఈ మధ్యే నా మేనల్లుడు కొన్ని వీడియోలు పంపించాడు. మా నాన్న ఫోటోని కుర్చీలో పెట్టింది మా అమ్మ. కొందరు పిల్లలు అక్కడికి వచ్చారు. అమ్మ మంజీర పట్టుకుని భజనలు పాడుతోంది. నా చిన్నతనంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. శారీరకంగా నీరసపడిపోయినా మానసికంగా మాత్రం ఎప్పుడూ హుషారుగానే ఉంటుంది. చిన్నతనంలోనే మా అమ్మ తన తల్లిని పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఒంటరిగానే బతికింది. తన తల్లి ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయే అదృష్టం ఆమెకు లేకుండా పోయింది. బడికి వెళ్లే అవకాశమూ లేదు. తన చిన్నతనమంతా పేదరికంలోనే గడిచిపోయింది" అని బ్లాగ్‌లో రాశారు ప్రధాని మోడీ.


2016లో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు అందరి సామాన్యుల్లాగే ATM ముందు క్యూలో నిలుచుని డబ్బులు డ్రా చేసుకున్నారు. గతేడాది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా తీసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న వృద్ధులకు స్ఫూర్తిగా నిలిచారు. 


Also Read: Heeraben Modi Death: హీరాబెన్ మృతి పట్ల రాహుల్, నితీశ్ సహా ప్రముఖుల సంతాపం