Heeraben Modi Death: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (100) మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖులు.. ప్రధాని మోదీ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తల్లి హీరాబా వంద సంవత్సరాల పోరాట జీవితం భారతీయ ఆదర్శాలకు ప్రతీక. మోదీజీ తన జీవితంలో '#మాతృదేవోభవ' అనే స్ఫూర్తిని, హీరాబా విలువలను ఎంతగానో పాటించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి! - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి శ్రీమతి హీరాబా మరణవార్త చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ సహా ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, ప్రేమను తెలియజేస్తున్నాను. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తల్లి శ్రీమతి హీరా బెన్ మరణం విచారకరం. తల్లి మరణం భరించలేని, పూడ్చలేని లోటు. ప్రపంచంలో తల్లి స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ దుఃఖ ఘడియలో బాధను భరించే శక్తిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. - నితీశ్ కుమార్, బిహార్ సీఎం
శ్రీమతి హీరాబెన్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఈ విషాద సమయంలో శ్రీ నరేంద్ర మోదీ కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నాను. దుఃఖ సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలు ఆయన కుటుంబంతో ఉన్నాయి. - మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఆసుపత్రిలో
మోదీ తల్లి హీరాబెన్ (100) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
మాతృమూర్తి మరణంతో ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే దిల్లీ నుంచి గుజరాత్ చేరుకుని ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మరోవైపు ఈరోజు తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నారు.
Also Read: Heeraben Modi Death: హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి- తల్లికి మోదీ కన్నీటి వీడ్కోలు!