Young People To Have A Heart Attack: గుండెపోటు ముప్పు ఒకప్పుడు 50 ఏండ్లు పైబడిన వారిలోనే కనిపించేది. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధ లేకుండా గుండెపోటు ప్రాణాలను తీస్తోంది. గత కొద్దికాలంగా గుండెపోటుతో సిద్ధార్థ్ శుక్లా (40), పునీత్ రాజ్‌కుమార్ (46) లాంటి నటులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గుండెపోటు అనేది వయసుతో సంబంధం లేకుండా వస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హార్ట్ ఎటాక్ ఏ వయసులోని వారికి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందంటున్నారు. గుండెపోటు ప్రారంభ లక్షణాల గురించి అవగాహన తెచ్చుకోవడంతో పాటు ప్రాణాలు కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
యువత గుండెపోటుకు ఎందుకు గురవుతున్నారు?
గత కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వేధిస్తోంది. జీవన విధానంలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి సహా పలు కారణాలతో యువతలో గుండెపోటు సమస్య తీవ్రం అవుతున్నది. కొన్నిసార్లు యువతలోని అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు కూడా గుండెపోటుకు దారితీస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సోకిన యువతలో గుండెపోటు ముప్పు మరింత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. గుండెపోటుతో చనిపోయిన యువతలో ఎక్కువగా కరోనా సోకినవారే ఉన్నట్లు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాదు, కరోనా ప్రారంభం తర్వాత అమెరికా సహా పలు దేశాల్లో అన్ని వయసుల వారిలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరిగినట్లు వెల్లడిస్తున్నాయి. ఈ మరణాలు 25 నుంచి 44 సంవత్సరాల వయస్సు గలవారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. వృద్ధులతో పోలిస్తే మరణాల రేటు 23 నుంచి 34% పెరిగినట్లు వివరించారు.
యువతలో గుండెపోటు లక్షణాలు
గుండెపోటుకు సంబంధించిన లక్షణాల విషయానికి వస్తే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మారే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు స్త్రీ, పురుషులలో భిన్నంగా ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండెపోటుకు సంబంధించి కొన్ని సాధారణ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. ఛాతీలో నొప్పి లేదంటే అసౌకర్యం
2. మెడ, దవడ, చేతులతో సహా ఛాతి పైభాగంలో నొప్పి
3. శ్వాస ఆడకపోవడం
4. కళ్లు మసకగా కనిపించడం
5. చల్లని చెమటలు పట్టడం
6. విపరీతమైన అలసట
7. వికారం, వాంతులు
8. తీవ్రమైన ఆందోళన, భయం
9. లో ఫీవర్
గుండెపోటు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు
గుండెపోటు వచ్చిన సమయంలో తీసుకునే తక్షణ చర్యలు వ్యక్తి మరణాన్ని ఆపే అవకాశం ఉంటుంది. గుండెపోటు సమయంలో వెంటనే వైద్యులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాలి. ఈ సమయంలో ఆస్పిరిన్ ను నమలడం లేదంటే మింగడం వల్ల గుండెపోటు నుంచి ప్రాణాలు కాపడుకునే అవకాశం ఉంటుంది. గుండెపోటుతో బాధపడుతున్న వ్యక్తి స్పందించకపోతే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేయాలి. మెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) ప్రకారం, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ఉన్నవారిని ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు CPR చేయడం ఉత్తమమైన మార్గం అని సూచిస్తున్నది. CPR అనేది మనిషి మరణాన్ని సమర్థవంతంగా అడ్డుకునే అవకాశం ఉంటుంది. CPR చేస్తూనే గుండెపోటు సోకిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Read Also: ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే ఇలా చేయండి, ప్రాణం కాపాడినట్టే