ఓ పక్క కరోనా, మరో పక్క మంకీ పాక్స్.. ఇప్పుడు టమోటో ఫీవర్ ప్రజలను భయపెడుతుంది. చిన్న పిల్లలకి టమోటో ఫీవర్ వచ్చి కలవర పెడుతుంది. భారత్ లో ఈ ఏడాది మే నుంచి కనిపిస్తున్న టమోటో ఫీవర్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ ద్వారా వస్తున్న ఈ అంటూ వ్యాధి ఎక్కువగా 1-9 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ లో చిన్నారుల్లో టమోటో ఫీవర్ లక్షణాలు ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫ్లూ కారణంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు వస్తాయి. చర్మం చాలా చికాకు పెడుతూ అధిక జ్వరం బాధిస్తుంది. పిల్లలు ఎక్కువగా డీ హైడ్రేట్ అవుతారు. చేతులు, పాదం, నోటిలో బొబ్బలు (హెచ్ యఫ్ ఎం డి) రంగు దద్దుర్లు, బొబ్బలు వస్తాయి. కానీ ఇది పెద్దల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పెద్ద వాళ్ళు మాత్రమే ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
నివారణ ఎలా?
టమోటో ఫీవర్ తగ్గించేందుకు నిర్దిష్టమైన మందులు ఏవి అందుబాటులోకి రాలేదు. కానీ జ్వరం, ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్ తీసుకోవాలి. దీని వల్ల జ్వరం అదుపులోకి వస్తుంది. శరీరం డీ హైడ్రేట్ కాకుండా బాగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి. అలాగే ఈ అంటు వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే నివారణకు అసలు మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన చిన్నారుల దగ్గరకి వెళ్ళకుండా చూడాలి. వారి దగ్గర నుంచి బొమ్మలు, వస్తువుల మార్పిడి చెయ్యకూడదు. వ్యాధి సోకిన చిన్నారులకి సంబంధించిన వస్తువులన్నీ వేరుగా ఉండాలి. వాళ్ళు ధరించే బట్టలు, తినేందుకు ఉపయోగించే పాత్రలు ఎప్పటికప్పుడు వేడి నీటితో శుభ్రం చేసుకుంటూ వాటిని విడిగా ఉంచాలి. వ్యాధి ఇతరులకి సంక్రమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే భారత ప్రభుత్వం వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేలా తగు సూచనలతో కూడిన గైడ్ లైన్స్ జారీ చేసింది.
టమోటో ఫ్లూ అనేది పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. కేరళలో సుమారు ఐదేళ్ల లోపు పిల్లల్లో 82 కి పైగా కేసులు బయటపడ్డాయి. దేశం మొత్తం మీద 100కి పైగా కేసులు నమోదయ్యాయి. టమోటో ఫీవర్ వల్ల వచ్చే బొబ్బలు పెద్దవిగా ఉంటాయి. ప్రస్తుతానికి ఓ నివేదిక ప్రకారం ఈ టొమాటో ఫీవర్ ప్రాణాంతకం కాదని తెలుస్తోంది. అయితే కోవిడ్ మళ్ళీ విజృంబిస్తున్న ఈ తరుణంలో టమోటో ఫీవర్ కూడా వ్యాప్తి కాకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టమోటో ఫీవర్ లక్షణాలు కొద్దిగా మంకీ పాక్స్ ని పోలి ఉంటాయి. దేశంలో మంకీపాక్స్ కూడా వ్యాపిస్తుంది. దీంతో టమోటో ఫ్లూ లక్షణాలు కొన్ని మంకీపాక్స్ లానే ఉంటాయి. కాబట్టి కొంతమంది టమోటో ఫ్లూ వల్ల వచ్చే బొబ్బలు మంకీపాక్స్ వల్లనేమో అనుకుంటున్నారు. ఈ రెండు వ్యాధుల్లోను బొబ్బలు, దద్దుర్లు వస్తాయి. కాకపోతే టమోటో ఫ్లూ పిల్లలోనే వస్తుంది కాబట్టి వైద్యులను సంప్రదించాకే రెండింటిలో ఏ వ్యాధి సోకిందో నిర్ధారణకు రావాలి.
Also Read: పిల్లలకి జలుబు చేసిందని నెబులైజర్ పెడుతున్నారా? అయితే జర జాగ్రత్త