Chandrababu Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పం పర్యటన ఉద్రిక్తంగా సాగుతోంది. గురువారం కుప్పంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న కొల్లుపల్లిలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. నేడు కుప్పంలో వైఎస్ఆర్ సీపీ నేతలు బంద్ కు పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో రెండో రోజు చంద్రబాబు పర్యటనలో అన్న క్యాంటీన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి చేరుకుని అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. లోపలి ఫ్లె్క్సీలను చింపేశారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద టేబుళ్లు ధ్వంసం చేశారు. చంద్రబాబు పర్యటనకు బదులుగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేశారు. ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ కూడా తమ ఇళ్ల నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకూ నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు.


అన్న క్యాంటీన్ వద్ద ఉన్న టీడీపీ నాయకులపై దౌర్జన్యంతో వైసీపీ నేతలు దాడికి దిగారు. వైసీపీ, టీడీపీ నేతలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో చిత్తూరు ఎస్పీ కూడా కుప్పంకు చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద, కట్టుదిట్టమైన బలగాలతో  పోలీసులు మోహరించారు. చిత్తూరు జిల్లా నుంచే కాక తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాల నుంచి అదనపు పోలీస్ బలగాలు కుప్పంకు చేరుకున్నాయి. కుప్పంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.


వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుంచి చేసిన నిరసనలకు పోటీగా, తెలుగు దేశం కార్యకర్తలు కూడా నిరసనలకు దిగారు. వారు ఏకంగా ఎమ్మెల్సీ భరత్ ఇంటికి ర్యాలీగా బయలుదేరారు. 


చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన మూడు రోజుల పర్యటన బుధవారం (ఆగస్టు 25) ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తొలి రోజు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కొళ్లుపల్లె, శివునికుప్పం, చల్దిగానిపల్లెల్లో చంద్రబాబు పర్యటించారు. నేడు గురువారం కుప్పంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, టీడీపీ కార్యాలయాన్ని నేడు ప్రారంభించాల్సి ఉంది.


చంద్రబాబు వ్యాఖ్యలు


చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా నేడు (ఆగస్టు 25) తలెత్తిన ఉద్రిక్తతలు, అన్నా క్యాంటిన్ ధ్వంసం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ నేతల తీరును ఖండించారు. తనపైనే దాడికి సిద్ధమైన వైఎస్ఆర్ సీపీ నేతలకు సామాన్య ప్రజలపై దాడి చేయడం ఓ లెక్కా అని అన్నారు. టీడీపీ నేత రవిచంద్ర 90 రోజుల నుంచి పేద ప్రజలకు అన్నం పెడుతుంటే అది నేరమా అని ప్రశ్నించారు. ఇది తప్పు అవునా కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా ధర్మపోరాటానికి కుప్పం నుంచే నాంది పలుకుతున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. ప్రజా పరిరక్షణకు నాంది అని అన్నారు. కుప్పంలో గురువారం చెలరేగిన ఉద్రిక్తతల వేళ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సీఎం జగన్, వైఎస్ఆర్ సీపీ నేతలను విమర్శిస్తూ మాట్లాడారు.