నిద్రలో వచ్చే సమస్యలు మనకు తెలియవు, కానీ మనతో పాటూ ఇంట్లో ఉంటున్నవారికి తెలుస్తాయి. ఉదాహరణకు గురకనే తీసుకోండి. ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా గురక వస్తున్నా కూడా నిద్రపోతున్న వ్యక్తికి తెలియదు, కానీ పక్కన పడుకున్న వారికి నరకంగా ఉంటుంది. అయితే గురక పెడుతున్నారంటే వారు హాయిగా నిద్రపోతున్నట్టు మాత్రం కాదు, ఏదో ఒక సమస్య ఉన్నట్టు అర్థం. అది ‘స్లీప్ ఆప్నియా’ వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. కేవలం గురక మాత్రమే కాదు, రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, నిద్ర పట్టినా రెండు మూడుగంటలకే తెలివి వచ్చేయడం, ఆఫీసుల్లో హఠాత్తుగా నిద్ర కమ్ముకురావడం, తలనొప్పి లాంటివి కూడా ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు.
ఏంటీ వ్యాధి?
ఇది ఒక నిద్ర సంబందిత వ్యాధి. ఈ వ్యాధి బారినపడినప్పటికీ, కనీసం ఆ విషయాన్ని గుర్తించలేరు. అదే ఈ వ్యాధి విషయంలో తీవ్రతను పెంచేస్తుంది. నిద్ర మధ్యలో శ్వాస హఠాత్తుగా ఆగిపోతుంది, దీంతో అకస్మాత్తుగా మెలకువ వచ్చేస్తుంది. శ్వాస సరిగా అందకపోతే రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దీని వల్ల చాలా ప్రమాదకరపరిస్థితి ఏర్పడవచ్చు. కేవలం ఒక్కసారే కాదు ఒక్క రాత్రిలో చాలా సార్లు ఇలా శ్వాస ఆగిపోయే అవకాశం ఉంది. అదే స్లీప్ ఆప్నియా వ్యాధి. ఎక్కువ సేపు శ్వాస ఆగిపోతే, గుండెకు ఇబ్బంది కలుగుతుంది. ఒక్కోసారి మరణం సంభవించే వరకు వెళుతుంది ఈ వ్యాధి తీవ్రత. అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
స్లీప్ ఆప్నియా రెండు రకాలు. అందులో ఒకటి ‘అబ్ స్ట్రిక్టివ్ స్లీప్ ఆప్నియా’. దీనివల్ల నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక రెండోది ‘సెంట్రల్ స్లీప్ ఆప్నియా’. దీనిలో మీ శ్వాసను నియంత్రించే కండరాలకు మెదడు సరైన సంకేతాలను పంపలేదు. దీని వల్ల ఈ స్లీప్ ఆప్నియా ఏర్పుడుతుంది.
మగవారికే ఎక్కువ
స్లీప్ ఆప్నియా సమస్య మహిళలంతో పోలిస్తే మగవారికే అధికంగా వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం, రక్తనాళాలు కుచించుకుపోవడం వంటి పరిస్థితుల వల్ల ఈ వ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ సమస్యకు తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరణం సంభవించే అవకాశం ఉంది.
ఇలా నిర్ధారణ
స్లీప్ ఆప్నియో ఉందో లేదో తెలుసుకునేందుకు స్లీప్ సెంటర్ లో రాత్రంతా ఉండాలి. అక్కడ మీ నిద్రను వైద్యులు స్టడీ చేస్తారు. దీన్ని పాలీ గ్రోమిక్ అంటారు. మెదడు తరంగాలు, రక్తంలో ఆక్సిజన్ శాతం, ఎన్నిసార్లు నిద్రభంగం అవుతోంది, శ్వాస అందకపోవడం వంటివన్నీ పరిశీలించి నిర్ధారణకు వస్తారు. స్లీప్ ఆప్నియా తీవ్రతను బట్టి చికిత్సను చేస్తారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది... ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా
Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి