ఇవి కోళ్లే... కానీ చాలా ప్రత్యేకమైనవి. సాధారణ కోళ్లతో పోలిస్తే వీటి ద్వారా అందే పోషకాలు కూడా అధికం. రుచి కూడా భిన్నంగా ఉంటోంది. ప్రపంచంలో ఇలాంటి నల్లకోళ్లు కేవలం మూడే రకాలు ఉన్నాయి. వాటిలో ఒకరకం మనదేశనంలోనే ఉంది. అవే కడక్ నాథ్ కోళ్లు. ఇక చైనాలో సిల్కీ రకం, ఇండోనేషియాలో అయమ్ సెమనీ... ఇవన్నీ కూడా నల్లకోళ్ల జాతివే. కేవలం వీటి ఈకలే కాదు, లోపల మాంసం కూడా నలుపురంగులోనే ఉంటుంది. అదే వీటి ప్రత్యేకత. ఇవి నల్లగా ఉన్నప్పటికీ గుడ్లు మాత్రం క్రీమ్ కలర్ లో ఉంటాయి. ఫైబ్రోమెలనోసిస్ అనే వర్ణద్రవ్యం కారణంగా వీటికి ఇంత ముదురు నలుపురంగు వచ్చింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ చెప్పిన ప్రకారం ప్రపంచంలో అత్యంత ముదురు రంగు వర్ణద్రవ్యాన్ని కలిగిన జీవి ఇదే.
మనదేశంలో...
సోషల్ మీడియాలో ఎక్కువగా వీటి ఫోటోలు వైరల్ అవుతుంటాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కడక్ నాథ్ కోళ్లు దొరుకుతుంటాయి. వీటిని ‘కాళీమాసీ’ అని పిలుస్తారు. మధ్యప్రదేశ్లోని గిరిజనుల అధికంగా నివసించే జబువా జిల్లాను వీటి పుట్టినిల్లుగా చెబుతారు. అక్కడ నివసించే ఆదివాసీలలోని నిరుపేదలు వీటిని పెంచి, అమ్ముకోవడం ద్వారా జీవనం సాగించేవారు. ఇప్పుడు కడక్ నాథ్ కోళ్ల పెంపకం పెద్ద వ్యాపార మార్గంగా మారిపోయింది. చాలా మంది కోళ్ల వ్యాపారులు వీటిని పెంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్నారు.
రుచి, పోషకాలు సూపర్
ఈ కోడి మాంసం చాలా మేలు చేస్తుంది. మహిళల్లో అధిక రక్తస్రావాలను, గర్భస్రావాలను, ప్రసవ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే పురుషుల్లో కూడా నరాల బలహీనతను తగ్గించి, వయాగ్రాల పనిచేస్తుంది. ఇందులో బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. నిమోనియా, రక్త హీనత, ఆస్తమా, క్షయ వ్యాధిగ్రస్తులు ఈ నల్లకోడి కూరని తింటే చాలా మంచిదని చెబుతున్నారు పోషకాహారనిపుణులు. మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనాల్లో ఈ కోడి మాంసం గుండెకి మేలుచేస్తుందని తేలింది. వీటి గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రోటీన్, ఇనుము పుష్కలంగా లభిస్తుంది. వీటిని తింటే నీరసం దరిచేరదు.
Also read: Good touch And Bad touch: పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కొన్ని చిట్కాలు ఇవిగో...
Also read: యూరిన్ రంగు మారిందా? జాగ్రత్త పడండి
Also read: గ్రీన్ టీ తాగే పద్ధతి ఇది... ఎప్పుడుపడితే అప్పుడు తాగేయకూడదు