దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరిగే రాష్ట్రాల జాబితాను జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసింది. 2020 సంవత్సరానికి సంబంధించి ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. ఏపీలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు, దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గతేడాది జరిగిన ఈ తరహా ఘటనల్లో 33.14 శాతం ఏపీలోనే నమోదయ్యాయి. 2019లో ఈ కేసుల సంఖ్య 1,892 నమోదు కాగా.. ఆ సంఖ్య 2020కి 2,342కు పెరిగింది. ఏడాది వ్యవధిలో కేసుల సంఖ్య 23.78 శాతం వరకు అధికమైంది. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పునరావృతం అవుతున్నాయనడానికి ఇది నిదర్శనంగా నిలిచింది.
ఏపీలో 1,88,997 కేసులు..
ఏపీలో మొత్తం 2,38,105 నేరాలు జరగ్గా.. ఐపీసీ కింద 1,88,997 కేసులు నమోదయ్యాయి. 2019తో పోలిస్తే ఐపీసీ కేసుల సంఖ్య 58 శాతం ఎక్కువగా ఉంది. 2020లో స్పెషల్ లోకల్ లాస్ (ఎస్‌ఎల్‌ఎల్) కింద 49,108 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2019తో పోలిస్తే ఎస్‌ఎల్‌ఎల్ కింద నమోదైన కేసుల సంఖ్య 85 శాతం పెరిగింది. రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 2019తో పోలిస్తే 3.70 శాతం మేర తగ్గిందని నివేదిక పేర్కొంది. 2019లో 17,746 నేరాలు నమోదు కాగా.. 2020లో ఈ సంఖ్య 17,089కి తగ్గడం విశేషం. ఈ తరహా నేరాలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. 2019లో పదో స్థానంలో ఉన్న ఏపీ.. ఈసారి 8వ స్థానంలో నిలవడం నేరాల తీవ్రతకు అద్దం పడుతోంది.
చిన్నారులపై ఆగని అఘాయిత్యాలు..
2019తో పోలిస్తే 2020లో చిన్నారులపై అఘాయిత్యాలు కాస్త పెరిగాయి. 2020లో 587 మంది చిన్నారులతో పాటు 1,192 మందిపై మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని నివేదిక పేర్కొంది. గతేడాది 2,524 కేసులు నమోదు కాగా, ఈసారి 2,648 కేసులు రికార్డు అయ్యాయి. హత్య కేసుల సంఖ్య విషయానికి వస్తే.. 2019లో 870గా ఉన్న సంఖ్య 2020లో 853కి తగ్గింది.
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు..
పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో హిమాచల్‌ప్రదేశ్ (72) దేశంలో మొదటి స్థానంలో ఉండగా.. ఏపీ రెండో స్థానంలో (70 కేసులు) ఉంది. స్త్రీలను రహస్యంగా చిత్రీకరించడం (Voyeurism) వంటి వాటిపై అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో (201).. ఏపీ (124 కేసులు) రెండో స్థానంలో ఉంది.
పరిచయస్తులే నిందితులు..
ఏపీలో మొత్తం 1,095 అత్యాచార ఘటనలు నమోదు కాగా అందులో 1,088 ఘటనల్లో బాధితులకు పరిచయస్తులే ఈ నేరాలకు పాల్పడినట్లు తేలింది. 91 ఘటనల్లో ఏకంగా బాధితుల కుటుంబ సభ్యులే నిందితులుగా ఉన్నారు. 997 ఘటనల్లో స్నేహితులు, ఆన్‌లైన్‌లో పరిచయం అయిన ఫ్రెండ్స్, ఇరుగు పొరుగువారి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది.
ఏపీలో నేరాలు తగ్గాయి.. పోలీసు ప్రధాన కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 2020లో చర్యలు తీసుకోదగ్గ నేరాలు (కాగ్నిజిబుల్ ) 15 శాతం మేర తగ్గాయని ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయం వెల్లడించింది. కొవిడ్ నిబంధనలను పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడటంపై గతేడాది 88,377 కేసులను నమోదు చేశామని తెలిపింది. ఈ కేసులను మినహాయిస్తే ఐపీసీ సెక్షన్ల కింద 1,00,620 కేసులే నమోదయ్యాయని పేర్కొంది. 2019లో ఈ కేసుల సంఖ్య 1,19,229గా ఉండేదని చెప్పింది. ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన వార్షిక నేర గణాంక నివేదికపై రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం ఈ మేరకు విశ్లేషణ ఇచ్చింది.