Mental Health: ఈ రోజుల్లో యాక్షన్ కంటెంట్ పట్ల ప్రజల్లో క్రేజ్ బాగా పెరిగింది. ఇటీవలే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విడుదలైంది.ఈ సినిమా థియేటర్లలోకి రాగానే దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాలా మందికి ఈ సినిమా బాగా నచ్చింది. అయితే, ఫైట్స్ నుంచి రొమాన్స్ వరకు చాలా సీన్లు మోతాదు మించి ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి. సినిమాలో చూపించిన పలు సన్నివేశాలు, డైలాగులపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 


ఈ చిత్రానికి వాస్తవికతతో సంబంధం లేదు. ఇది పూర్తిగా కల్పిత చిత్రం. ఇందులో నటుడు రణబీర్ కపూర్ తన జీవితమంతా తన తండ్రి ప్రేమను పొందేందుకు ఆరాటపడే కొడుకు పాత్రలో కనిపించాడు. తండ్రిని చంపేందుకు కుట్ర పన్నిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడనేది సినిమాలో చూపించారు. ఈ సందర్భంగా పలు యాక్షన్ సన్నివేశాల్లో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను వణికించాయి. దీంతో అలాంటి సీన్స్ ప్రేక్షకుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, హింసను ప్రేరేపిస్తాయనే ఆందోళన వ్యక్తమైంది. మరి దీనిపై మానసిక వైద్య నిపుణులు ఏమంటున్నారు?


మానసిక ఆరోగ్యంపై హింస ప్రభావం:


హింసాత్మక చలనచిత్రాలు, ధారావాహికలు లేదా ఇతర కంటెంట్ మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. హింసాత్మక చిత్రాలు మానసిక ఆరోగ్యానికి హాని కలిగించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవి మీ ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తాయి. అవేంటో చూడండి.


దూకుడు ప్రవర్తన, భయం:


ప్రజలు హింసాత్మక చలనచిత్రాలను చూసినప్పుడు.. అది వారిని మరింత దూకుడుగా మారుస్తుంది. అయితే, ప్రతి ఒక్కరూ హింసాత్మకంగా మారతారని దీని అర్థం కాదు. ఇది కొంతమంది వ్యక్తుల ప్రవర్తనలను ప్రభావితం చేయవచ్చు. కొందరు కొన్ని విషయాలను చాలా సులభంగా అనుకరించేస్తారు. ఆ సినిమాల్లో ఉండే హీరో తానే అన్నట్లుగా వ్యవహరిస్తారు. మొదట్లో అది సరదాగా అనిపించినా.. దాన్ని సీరియస్‌గా అనుకరిస్తే మాత్రం ప్రమాదమే. సున్నిత మనస్తత్వం కలిగే వ్యక్తులపై ఈ ప్రభావం వేరేగా ఉంటుంది. అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు భయం లేదా ఆందోళన కలుగుతుంది. మరింత ఒత్తిడి, ఆందోళనకు గురవ్వుతారు.


సానుభూతి లేకపోవడం:


మీరు చాలా హింసాత్మక సినిమాలు లేదా వెబ్ సీరీస్, టీవీ షోస్ చూసినట్లయితే.. మీ బుర్రలో అవే ఆలోచనలు ఉంటాయి. లేదా అసలు హింసాత్మక చర్యలపై సానుభూతి తగ్గవచ్చు. అంటే మీ కళ్ల ముందు ఎవరైనా హింసకు గురవ్వుతుంటే కామన్‌లే అని చూసి చూడనట్లు వదిలేస్తారు. లేదా బాధ్యత లేకుండా హింసాత్మక ఘటనలను వీడియోలు తీసుకుని.. తర్వాత వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ.. మీలో మీకు తెలియని శాడిస్టును నిద్రలేపుతారు. ప్రమాదాలు జరిగినప్పుడు వీడియోలు తీసేవారు ఈ కోవకే చెందుతారు.


పిల్లలపై చెడు ప్రభావం:


హింసాత్మక చిత్రాల ప్రభావాలకు పిల్లలు మరింత సున్నితంగా ఉండే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, అటువంటి కంటెంట్‌ చూడటం వల్ల పిల్లల ప్రవర్తన, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో వారి ప్రవర్తన హింసాత్మకంగా మార్చవచ్చు. అసాంఘిక శక్తులుగా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆ ఘటనల వల్ల పీడ కలలు వస్తాయి. భయాందోళనలకు గురిచేస్తాయి. పిరికివారిలా మార్చేస్తాయి.


Also Read : చలికాలంలో సన్​షైన్​ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.