Jai Bharath National Party Challenges : సీబీఐ మాజీ జేడీ ( CBI Former JD ) లక్ష్మీనారాయణ (VV Laxminarayana )రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ (Jai Bharath National Party)అంటూ ఆర్బాటంగా జనంలోకి వచ్చారు. ఐపీఎస్ అధికారిగా మంచి పేరు సంపాదించుకున్న వీవీ లక్ష్మీనారాయణ, ప్రజలకు ఇంకా ఏదో చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలం జనసేన పార్టీలో చేసినా... ఎక్కువకాలం ఉండలేకపోయారు. చట్టసభల్లో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏ పార్టీలో చేరకుండా సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. సొంత పార్టీతో అయినా అనుకున్న కలను నేరవేర్చుకుంటారా ? చట్టసభలో అడుగు పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన జనం ఆదరిస్తారా ?  ఎన్నికల్లో ఓటు వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. 


 


బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి రావడం కొత్తకాదు


దేశంలో అయినా, తెలుగు రాష్ట్రాల్లో అయినా, బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి రావడం, సొంత పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు. సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాశ్ నారాయణ సొంతంగా...లోక్ సత్తా అనే ఎన్జీవో సంస్థను స్థాపించారు. ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినా...ప్రజలు పట్టించుకోలేదు.


 


కేజ్రీవాల్‌ ఒక్కరే సక్సెస్‌


తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీ ఉద్యోగానికి రాజీనామా చేసి...బీఎస్పీలో చేరారు. సిర్పూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసినా... ఓటమే పలకరించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంతో మంది బ్యూరోక్రాట్లు పోటీ చేసి విజయం సాధించారు. కేంద్ర మంత్రులుగానూ పని చేస్తున్నారు. హర్దీప్ సింగ్ పురి, వీరేంద్ర సింగ్, అశ్వినీ వైష్ణవ్ వంటి వారు బీజేపీ పాలనలో పాలుపంచుకున్నారు. ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న కేజ్రీవాల్ పార్టీని స్థాపించి...అధికారంలోకి వచ్చారు. పంజాబ్ లోనూ పార్టీని అధికారంలోకి తెచ్చారు. 


 


ముందున్న సవాళ్లు


జై భారత్‌ నేషనల్‌ పార్టీ స్థాపించిన వీవీ లక్ష్మినారాయణ...వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరాలన్న కసితో ఉన్నారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. తెలుగుదేశం, వైసీపీల్లో చేరితే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో...సొంత జెండా, అజెండాను చేసుకున్నారు. అయితే ఇప్పుడు పార్టీని నడిపించడమే అసలైన సవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాదిరి సక్సెస్ అవుతారా ? లేదంటే మెగాస్టార్ చిరంజీవిలాగా మధ్యలోనే చాపచుట్టేస్తారా అన్న ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి. జనంలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎక్కువ కాలం నడిపించలేక...కాంగ్రెస్ లో కలిపేశారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి...గత ఎన్నికల్లో పోటీ చేసిన గెలవలేకపోయారు. అభిమానులు కూడా ఆయనకు ఓట్లు వేయలేదు. వారికే సాధ్యం కానిది లక్ష్మినారాయణ సాధిస్తారా అన్నది తేలాల్సి ఉంది. 


 రాజకీయ పార్టీని స్థాపించడం సులభమైనా...దాన్ని నడిపించాలంటే సరైన నాయకత్వం ఉండాలి. ప్రత్యర్థులను ఢీ కొట్టేలా నాయకులను తయారు చేసుకోవాలి. నేతలను సమన్వయం చేసుకోవడం, పార్టీని నడిపించడమంటే మాములు విషయం కాదు.  మహమహా నేతలే రాజకీయ పార్టీలను స్థాపించి...నడిపించలేక మరో పార్టీలో విలీనం చేసేశారు. పార్టీ అంటే నేతలు మధ్య విభేదాలు ఉంటాయి ? టికెట్ల గొడవలుంటాయా ? సామాజిక సమీకరణలు, ప్రతి పక్ష పార్టీల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించాలి. బలమైన నేతలను ఎన్నికల్లో నిలబెట్టాలి. ఆర్థిక బలం, అంగబలం ఉండాలి. వీటన్నంటిని ఎలా పరిష్కారన్నదే కీలకం. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం, వైసీపీ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. వారికి ఆర్థిక బలంతో పాటు గ్రామస్థాయిలో కేడర్ కూడా ఉంది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. వీటికి తోడు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. వీటన్నంటిని కాదని జనం జై భారత్ నేషనల్ పార్టీ వైపు వస్తారా ? లక్ష్మినారాయణను అభిమానించే వారంతా ఓట్లు వేస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది.