చిన్నని నల్లని రాళ్ళలా కనిపించే ఈ విత్తనాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే విత్తనాలు అంటే చియా సీడ్స్, గుమ్మడి గింజలు గురించే అందరికీ తెలుస్తుంది. కానీ చక్సు సీడ్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఉత్తర పశ్చిమ భారతదేశంలో వీటిని ఎక్కువగా సాగు చేస్తారు. చియా విత్తనాల మాదిరిగా ఇవి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. చిన్న రాళ్ళలా కనిపించే ఈ నల్లని విత్తనాలని చక్సు సీడ్స్ అని పిలుస్తారు. కాసియా అబ్బాస్ హెర్బ్ అనే రకానికి చెందింది. రుచి కాసింత చేదుగా ఉంటుంది కానీ ఉపయోగాలు మాత్రం బోలెడు ఉన్నాయి.


చక్సు విత్తనాల వల్ల ప్రయోజనాలు


ఇంగ్లీష్ లో వీటిని జాస్మిజాజ్ అని పిలుస్తారు. హిమాలయాల పరిసరాల్లో ఇవి ఎక్కువగా పండుతాయి. ఇదొక జిగట మొక్క. దీని విత్తనాలు దగ్గర నుంచి ఆకుల వరకు తినదగినవిగానే పరిగణిస్తారు. వీటిలో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. కంటి ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సహకరిస్తుంది. చర్మ వ్యాధులని నయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ చిన్న విత్తనాలు మూత్రాశయ సమస్యల చికిత్సకు సమర్థవంతంగా పని చేస్తాయి. దానితో పాటు కాలేయం, మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తాయి. అంతే కాదు.. జలుబు, కళ్ళ నుంచి నీళ్ళు కారడం, గాయాలు, పుండ్లుకి చికిత్స చేయడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్యకి ఇవి గొప్ప నివారణ.


ఎలా ఉపయోగించాలి?


చక్సు విత్తనాల పేస్ట్ బయట మార్కెట్లో దొరుకుంటుంది. కానీ దాన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటే ఉపయోగించడం చాలా సులభం. 3-6 గ్రాముల చక్సు గింజల పొడిని రోజుకు మూడు సార్లు తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ గింజలతో కషాయం కూడా చేసుకుని తీసుకోవచ్చు. ఆహారం తీసుకున్న తర్వాత 15-20 ఎంఎల్  మాత్రమే మూడు సార్లు తీసుకోవచ్చు. ఇలా చేస్తే శరీరంలోని రోగాలు తగ్గిపోతాయి. అలాగే గాయాలకి చికిత్స చెయ్యడానికి చక్సు సీడ్స్ బాగా పని చేస్తాయి. చక్సు విత్తనాల పేస్ట్ లేదా నూనె ఈ గాయాలైన ప్రదేశంలో రోజుకు రెండు నుంచి మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. వాటి తాలూకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.


చక్సు డికాషన్ ఎలా తయారు చెయ్యాలి?


పొడిని తయారు చేసుకోవడానికి ముందుగా ఈ విత్తనాలు శుభ్రంగా నీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఎండిన తర్వాత ఆ గింజలని మిక్సీ చేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. పేస్ట్ చేయడానికి మిక్సీ చేసే సమయంలో కొద్దిగా నీరు పోస్తే సరిపోతుంది. ఈ మొక్క ఆకులని డికాషన్ గా కూడా చేసుకోవచ్చు. ఆకులు లేదా 1 టేబుల్ స్పూన్ గింజలని గోరు వెచ్చని నీటిలో సుమారు 30-40 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత వాటిని తక్కువ మంట పెట్టి ఉడికించుకోవాలి. ఆ నీటిని టీ లేదా కషాయంగా కూడా తాగొచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఓ మై గాడ్, జామ ఆకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? ఎలా తీసుకుంటే మేలు?