Siddipet News: సిద్దిపేట జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. రెండు పడక గదుల ఇళ్లు రాలేదని మనస్తాపంతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు కారణం అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగి చనిపోయాడు. ఆ వీడియోని స్నేహితుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు. విషయం గుర్తించిన బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.


అసలేం జరిగిందంటే..?


సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 26వ వార్డు పరిధి గణేశ్ నగర్ కు చెందిన 36 ఏళ్ల  శిలాసాగర్ రమేష్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతని భార్య లలిత గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పొరుగు సేవల కింద జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి పదేళ్ల లోపు వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే రెండు పడక గదుల మంజూరు విషయంలో తనకు న్యాయం చేయాలని కోరేందుకు సోమవారం కలెక్టరేట్ లోని ప్రజావాణికి రమేష్ వెళ్లాడు. సాయంత్రం కలెక్టరేట్ భవనం వెనుక పార్కింగ్ స్థలంలో అపస్మారక స్థితిలో కనిపించారు. విషయం గుర్తించిన స్థానికులు అంబులెన్సుకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన వైద్య సిబ్బంది రమేష్ ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడంటే..?


"ఇంకెన్ని చేస్తావో చెయ్యండి. తాగుతున్న చూడు. డీజిల్ కూడా తెచ్చుకున్నా. పోసుకొని అంటవెట్టుకుంటా. లైటర్ కూడా తెచ్చుకున్న. నేను ఒక్కదాంతో చావను. మొండిఘటాన్ని. నా చావుకు కారణం నువ్వే. నా జీవితంతో చెలగాటం ఆడాలనుకున్నావు. నీకు ఆ ఛాన్సు ఇవ్వను. ఇయ్యాళ ఈ పని చేసుకుంటున్నా. ఎట్ల తాగుతున్ననో చూడు. ప్రవీణ్ కౌన్సిలర్ సెలవు" అంటూ ఓ సెల్ఫీ వీడియోని రికార్డు చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు. అలాగే ఇదే వీడియోలో మరో స్థానిక నాయకుడిని కూడా తీవ్రంగా దూషించారు. రమేష్ భార్య లలిత, సోదరుడు వేణు మాట్లాడుతూ.. ఇల్లు మంజూరు అయినట్లు నాలుగు సార్లు జాబితాలో పేరు వచ్చినా కౌన్సిలర్ అడ్డుకున్నారని తెలిపారు. పిల్లల పోషణే కష్టంగా ఉన్న తమకు ఉండేందుకు గూడు లేదని వాపోయారు. అదే గూడు కోసం తన భర్త చనిపోవడంతో కుటుంబ పరిస్థితి మరింత చతికిలబడిపోయిందని ఆవేదన వ్కక్తం చేశారు. అయితే లలితకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కౌన్సిలర్ కక్ష పెంచుకున్నారని మృతుడి సోదరుడు వేణు తెలిపారు. 


నాకెలాంటి సంబంధం లేదు: కౌన్సిలర్ ప్రవీణ్


ఇదే విషయమై కౌన్సిలర్ ప్రవీణ్ ను సంప్రదించగా.. "ఆటో డ్రైవర్ రమేష్ రెండు పడక గదుల ఇళ్లు మంజూరు విషయమైనా, ఆయన ఆత్మహత్య అంశమైనా నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను డబ్బులు డిమాండ్ చేశానని ఆరోపిస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఫైరవీ చేయలేదు. నా వార్డు పరిధిలో ఉపాధి కల్పించే అంశంలో ఎవరికైనా సాయం చేశానే తప్ప హానీ తల పెట్టలేదు." అని తెలిపారు. 


పునపరిశీలన చేస్తాం:  స్ఖానిక తహసీల్దార్


ఇదే విషయమై సిద్దిపేట జిల్లా తహసీల్దార్ విజయ సాగర్ ను సంప్రదించగా.. ఇటీవల రూపొందించిన ఇళ్ల లబ్ధిదారుల జాబితాలోని కొందరికి, అభ్యంతరాల మేరకు ఇళ్లు కేటాయించలేదని తెలిపారు. పునపరిశీలన చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని వివరించారు.