Jagtial News : జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రైతు సమస్యలపై ధర్నా నిర్వహించారు. ధర్నా జరుగుతుండగా ఓ వ్యక్తి బైక్ పై రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తితో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. జగిత్యాలకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు సదరు వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. ఈ విషయంలో పోలీసులు కలగజేసుకొని ఆ వ్యక్తిని అక్కడ నుంచి పంపించారు. అయితే ఈ దాడిలో ఆ వ్యక్తి చొక్కా చిరిగిపోయింది. తాను ఆసుపత్రికి వెళ్లాలని అందుకు దారి ఇవ్వమని అడిగితే దాడికి పాల్పడ్డారని బాధితుడు అంటున్నాడు. పోలీసులు సర్దిచెప్పి అతడిని అక్కడ నుంచి పంపించేశారు. అయితే రైతు సమస్యలపై నిరసనల చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇలా సామాన్యులపై దాడికి పాల్పడడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ నిరసనలు చేస్తున్నారని, అత్యవసర పరిస్థితుల్లో కూడా దారి ఇవ్వకుండా స్థానికుల్ని ఇబ్బందులు పెట్టడం సరికాదని అంటున్నారు.
కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్తత
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ ఎంపీ వీహెచ్ పాల్గొన్నారు. రగుడు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నేతలు... కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారికి అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. బారికేడ్లు అడ్డుపెట్టి నిరసనకారుల్ని కలెక్టరేట్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బారీకేడ్లను దాటి కలెక్టరేట్ లోకి వెళేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం జరిగింది.
ధరణి పోర్టర్ రద్దు చేయాలని డిమాండ్
ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాయి. అలాగే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్ల లోపలికి వెళ్తేందుకు యత్నించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బారికేడ్లు పెట్టి వారిని నిలువరించారు. మరోవైపు హన్మకొండ జిల్లా ఏకశిలా పార్క్, బాలసముద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. రైతు, వ్యవసాయ భూమి సమస్యలపై కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు.
వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రికత్త
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కార్యకర్తలను సముదాయించారు. రేవంత్ రెడ్డి, కొందరిని కలెక్టర్ ఛాంబర్ లోకి తీసుకెళ్లి కలెక్టర్ తో మాట్లాడించారు పోలీసులు. కలెక్టరేట్ వద్ద కలెక్టర్, ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. రేవంత్ రెడ్డి కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.