Hyderabad Crime News: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఆటోమొబైల్ ఫైనాన్షియర్స్ రెచ్చిపోయారు. ఓ వాహనదారుడిపై కత్తితో దాడి చేశారు. ప్రతిఘటించిన వాహనదారుడు వారిని తప్పించుకొని ఎలాగో అలా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వరకు పరుగులు తీశాడు. అయినప్పటికీ పైనాన్షియర్స్ అతడిని వదలలేదు. పోలీస్ స్టేషన్ లో కూడా వాహనదారుడిపై దాడికి పాల్పడ్డారు. అయితే విషయం గుర్తించిన పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో బాలుడికి కూడా గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు గాయాల పాలైన వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వాహనదారుడికి సంబంధించిన వర్గం వాళ్లు పోలీస్ స్టేషన్ కు చేరుకొని... నానా హంగామా చేశారు. దాడి చేసిన వారి వర్గం వాళ్లు కూడా పోలీస్ స్టేషన్ కు చేరడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది.


విషయం తెలుసుకున్న కాప్స్ ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఇరు వర్గాల వాళ్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. వాహనం సీజింగ్ పేరుతో అడ్డగించి తనపై కత్తితో దాడి చేశారంటూ వాహనదారుడు ఫిర్యాదు చేశాడు. నిస్సార్ ఖాన్ మోటర్ సైకిల్ కిస్తీలు కట్టకపోవడంతో అడ్డగించి అడిగితే తమపై దాడి చేశారంటూ మరోవర్గం వాళ్లు చెబుతున్నారు. అయితే వాహనాల సీజింగ్ పేరుతో నెంబర్ ప్లేట్ లేని మోటర్ సైకిళ్లపై తిరుగుతూ.. ఆటో మొబైల్ ఫైనాన్షియర్లు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వారి పై చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కత్తితో ప్రేమోన్మాది దాడి..


నెలరోజుల క్రితం హైదరాబాద్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ముషిరాబాద్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఆమె డిగ్రీ చదువుతోంది. యువతిపై దాడికి పాల్పడిన నిందితుడు రంజిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్ లో కత్తి దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల పరువు హత్యలు జరగగా, తాజాగా ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.  ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ప్రేమకత్తి పంజా విసిరింది. ముషీరాబాద్ బోలక్‌పూర్‌కు చెందిన ఓ యువతి, రంజిత్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. శనివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ సమీపంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఓ విషయంపై గొడప జరిగింది. ఈ గొడవతో రంజిత్ ఆగ్రహానికి గురై తనతో తెచ్చుకున్న ఆయుధంతో యువతిపై దాడి చేశాడు. ఆమె చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి అనంతరం రంజిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమీప హాస్టల్లో ఉన్న విద్యార్థులు విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన యువతిని కాచిగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు రంజిత్ కోసం గాలిస్తున్నారు.  ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. ఆమె కుడి చేతికి గాయం కావడంతో చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.