Western Style Diet: గత కొంత కాలంగా యువకులలో కొలొరెక్టర్ క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. ఈ వ్యాధి కారణంగా ప్రతి ఏటా వేలాది మంచి చనిపోతున్నారు. వచ్చే 20 ఏండ్లలో ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య 50 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాదికి 30 లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకుతున్నట్లు తెలిపారు. తాజాగా ఈ వ్యాధికి గల కారణాలను తెలుసుకునేందుకు కీలక పరిశోధన నిర్వహించారు అమెరికన్ పరిశోధకులు. కొలొరెక్టల్ క్యాన్సర్ కు కారణం వెస్ట్రన్ డైట్ అనే అభిప్రాయానికి వచ్చారు.


ఇంతకీ కొలొరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి?


జీర్ణ వ్యవస్థలో పెద్దపేగు చివరి భాగం ఆహారంలోని పోషకాలను శోషించడం కీలక పాత్ర పోషిస్తుంది. తీసుకున్న ఫుడ్ లోని వాటర్, పొటాషియం, కొవ్వులు, విటమిన్లను గ్రహించి శరీరానికి అందిస్తుంది. అనవసర వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. అయితే, మనం తీసుకునే ఆహార పదార్థాలు ఒక్కోసారి పెద్దపేగుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నేపథ్యంలోనే పెద్దపేగు క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మలద్వారం దగ్గర విపరీతమైన నొప్పి, మలంలో రక్తం రావడం, అలసట, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కలుగుతాయి.


యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్


కొలొరెక్టల్ క్యాన్సర్ అనేది అధిక కొవ్వు, తక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా ఆహార విధానాలు జీర్ణవ్యవస్థలో మార్పులను ప్రేరేపిస్తాయని వెల్లడించారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ‘వెస్ట్రన్ డైట్’ పేగులలోని సున్నితమైన సూక్ష్మజీవుల సమతుల్యతకు భంగం కలిగిస్తుందని కనుగొన్నారు. ఈ కారణంగా పేగు వాపుకు కారణమవుతున్నట్లు గుర్తించారు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారణం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తాజాగా చికాగోలో యాన్యువల్ అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ సమావేశంలో ఈ పరిశోధనకు సంబంధించిన కీలక విషయాలను పరిశోధకులు వెల్లడించారు. 


కొలొరెక్టల్ క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుకోవాలంటే?


ఆహారంలో ఎక్కువగా డైటరీ ఫైబర్‌ను చేర్చుకోవడం వల్ల అన్నవాహిక, కడుపు, పెద్దపేగు, పురీషనాళాన్ని ప్రభావితం చేసే వివిధ క్యాన్సర్లను అదుపు చేసే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గించడంలో ఆహార ఎంపిక అనేది కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. నారింజ, యాపిల్స్ లాంటి పండ్లు, తృణధాన్యాలు, గింజలు గట్ హెల్త్ ను సమర్థవంతంగా పెంచుతాయన్నారు. గట్ బ్యాక్టీరియాను పెంచేందుకు పైబర్ తీసుకోవాలని తెలిసినా, అమెరికాకు చెందిన చాలా మంది యువతీయువకులు ఎక్కువ మొత్తంలో పైబర్ తీసుకోవడం లేదని వెల్లడించారు. మహిళలు ప్రతిరోజూ 25 గ్రాములకు తగ్గకుండా ఫైబర్ తీసుకోవాలని పరిశోధకులు తెలిపారు. పురుషులు మాత్రం సుమారు 40 గ్రాములు తీసుకోవాలన్నారు. తగిన మోతాదులో ఫైబర్ తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను అదుపు చేసే అవకాశం ఉంటుందన్నారు. 


Read Also : నాన్​ వెజ్​ ఎక్కువగా తింటున్నారా ? అయితే మీ లివర్ మటాషే.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.