గ్లిజరిన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కన్నీళ్ళు రావడానికి సీరియల్స్, సినిమాల్లో నటీనటులు ఉపయోగిస్తారని. కానీ నిజానికి గ్లిజరిన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శీతాకాలంలో చర్మ, జుట్టు సంరక్షణకి ఇది అద్భుతంగా పని చేస్తుంది. చల్లని వాతావరణం కారణంగా చర్మం పొడి బారిపోతుంది. చర్మం మళ్ళీ తిరిగి తేమగా మారేందుకు గ్లిజరిన్ చక్కగా ఉపయోగపడుతుంది.


గ్లిజరిన్ అంటే ఏంటి?


ఇది రంగు, వాసన ఉండదు. కానీ తియ్యగా ఉంది. మందంగా, జిగటగా ఉండే పదార్థం. సబ్బు తయారీలో ఉప ఉత్పత్తి. చక్కెర, ఆల్కహాల్ సేంద్రీయ సమ్మేళనం. మొక్కలు, జంతు వనరుల నుంచి దీన్ని తయారు చేస్తారు. ఆరోగ్యం, అందం కోసం అనేక సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వినియోగిస్తారు. గ్లిజరిన్ సహజంగా లేదా సింథటిక్ గా తయారు చేస్తారు . జంతువుల కొవ్వు లేదా వెజిటబుల్ ఫ్యాట్ నుంచి సహజ గ్లిజరిన్ ఉత్పత్తి అవుతుంది. పెట్రోలియం, ప్రొపైలిన్, క్లోరిన్ తో కూడిన రసాయన ప్రక్రియల ద్వారా సింథటిక్ గ్లిజరిన్ ఉత్పత్తి అవుతుంది.


గ్లిజరిన్ వల్ల ప్రయోజనాలు


మాయిశ్చరైజర్ 


గ్లిజరిన్ అత్యంత ప్రభావవంతమైన మాయిశ్చరైజర్. ఇది తేమని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది రాసుకోవడం వల్ల చర్మంలోని నీటిని ఆవిరైపోకుండా నిలిపి ఉంచుతుంది. దీన్నే హ్యూమెక్టెంట్ అంటారు. గ్లిజరిన్ మాయిశ్చరైజర్ గా చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ గా ఉంచుతుంది.


ఎలా రాసుకోవాలి?


250 మి.లీ గ్లిజరిన్ కి రెండు టేబుల్ స్పూన్ల తాజా నిమ్మరసం జోడించడం ద్వారా ఇంట్లోనే గ్లిజరిన్ మాయిశ్చరైజర్ చేసుకోవచ్చు. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి దీన్ని రాసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అలా కాకుండా స్నానానికి ముందు కూడా రాసుకోవచ్చు.


యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్


మొహం మీద ముడతలు, వృద్ధాప్య ఛాయలు, గీతలు లేకుండా చేసేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. తేమ లేని నిస్తేజమైన, చికాకు, కఠినమైన చర్మానికి ఇది అద్భుతమైన రెమిడిగా పని చేస్తుంది. ఇది రాసుకోవడం వల్ల చర్మం మీద పగుళ్లు తొలగిపోతాయి. కొన్ని సంవత్సరాలుగా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం దీని ఉపయోగిస్తున్నారు. సాదాగా ఉండే గ్లిజరిన్ కి బదులు దానిలో కొన్ని పదార్థాలు జోడించి రాసుకుంటే మెరుగైన ఫలితాలు పొందుతారు.


ఎలా తయారుచెయ్యాలి?


3 టీ స్పూన్ల రోజ్ షిప్ ఆయిల్ తీసుకుని అందులో తేనె, గ్లిజరిన్ కలుపుకోవాలి. మొహం మీద వృత్తాకారం లో స్ట్రోక్స్ ఇస్తూ రాసుకోవాలి. 20 నిమిషాల పాటు ఫేస్ కు ఉంచుకున్న తర్వాత శుభ్రంగా కడగాలి.


మొటిమలు తగ్గిస్తుంది


మొటిమల సమస్య తగ్గించుకుని అందంగా మారేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యూటీ ఆర్సెనల్‌కు గ్లిజరిన్ జోడించి రాసుకోవచ్చు. ఈ పేస్ట్ ని రోజూ ముఖానికి రాసుకోవడం వల్ల చక్కని ఫలితాలు పొందుతారు.


ఎలా చేసుకోవాలి?


ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ లో సగం టేబుల్ స్పూన్ బోరాక్స్ పౌడర్, కొద్దిగా కర్పూరం వేసుకుని అందులో కొద్దిగా నీళ్ళు కలుపుకోవాలి. ఆ పేస్ట్ ని ముఖానికి రాసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మొహం మీద ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. రంధ్రాలు మూసుకుపోయేందుకు చల్లని నీటితో కడగాలి.


బ్లాక్ హెడ్స్ తొలగింపు


మొహం మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చూసేందుకు వికారంగా కనిపిస్తాయి. కొన్ని సార్లు ఫేషియల్స్ చేసిన కూడా వీటిని తొలగించుకోవడం కష్టం అవుతుంది. కానీ గ్లిజరిన్ తో వాటిని పోగొట్టుకోవచ్చు.


ఎలా రాసుకోవాలి?


ముల్తాని మట్టి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల బాదం పౌడర్, రెండు టీ స్పూన్ల గ్లిజరిన్ వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసుకుని కాసేపు అరనివ్వాలి. కొద్ది సేపటి తర్వాత శుభ్రంగా నీటితో కడగాలి.


టాన్ రిమూవర్


గ్లిజరిన్ తేలికపాటి సన్ స్క్రీన్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. సూర్యుడి హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. టాన్ రిమూవర్ గా చక్కగా పని చేస్తుంది. చర్మ రంధ్రాలకి అడ్డుపడే ధూళి, మలినాలని తొలగిస్తుంది. స్కిన్ టోన్ మెరిసేలా చేస్తుంది.


ఎలా తయారుచేసుకోవాలి?


బాగా పండిన అరటిపండు తీసుకుని దాన్ని మెత్తగా చేసుకోవాలి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేసుకోవడమే. సుమారు 10-15 నిమిషాల వరకు ఫేస్ కి మాస్క్ లా వేసుకుని ఉండాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మెరిసే మేని ఛాయ మీ సొంతం అవుతుంది.


గ్లిజరిన్ ఉపయోగించే ముందు జాగ్రత్తలు


⦿జిడ్డుగల చర్మంపై నేరుగా గ్లిజరిన్ ఎప్పుడు అప్లై చెయ్యొద్దు. దానికి రోజ్ వాటర్ వేసి కలుపుకోవాలి.


⦿ఎక్కువ మొత్తంలో గ్లిజరిన్ ఉపయోగించకూడదు.


⦿ఎక్కువసేపు చర్మంపై ఉంచుకోకూడదు.


⦿గ్లిజరిన్ జిడ్డుగా ఉండటం వల్ల దుమ్ము అంటుకునే అవకాశం ఉంది. అందుకో త్వరగా క్లీన్ చేసుకోవాలి.


⦿ఉత్తమ ఫలితాల కోసం శీతాకాలంలో గ్లిజరిన్ ఉపయోగించాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బ్రేక్ ఫాస్ట్‌లో పండ్లు తినకూడదని చెప్తున్న ఆయుర్వేద శాస్త్రం, ఎందుకంటే?