మహిళ తన భర్తను ఇతర మహిళలకు అద్దెకు ఇస్తోంది. ఇది వినేందుకు చాలా తేడాగా ఉంది కదూ. కాస్త, మన డర్టీ మైండ్‌ను పక్కన పెట్టి అసలు విషయం తెలుసుకుంటే.. ఆమెపై గౌరవం కలుగుతుంది. ఇంతకీ ఆమె తన భర్తను ఎందుకు అద్దెకు ఇస్తుందనేగా మీ సందేహం? అయితే, మనం యూకేకు వెళ్లాల్సిందే. 


లారా యంగ్ అనే మహిళ తన భర్త జేమ్స్, ముగ్గురు పిల్లలతో కలిసి బకింగ్‌హామ్‌షైర్‌లో నివసిస్తోంది. జేమ్స్‌ చాలామంచివాడు, ఇంట్లో ఎలాంటి పనులైనా అవలీలగా చేసేస్తాడు. వడ్రంగి పని నుంచి ఎలక్ట్రికల్ వర్క్ ఏదైనా సరే అతడికి కొట్టిన పిండి. అలాగే ఇంటిని అలంకరించడం నుంచి కార్పేట్ పనుల వరకు ఏదైనా సరే చేసేస్తాడు. జేమ్స్‌కు తోటపని అంటే కూడా ఇష్టమే. అంత ప్రతిభ ఉన్న తన భర్తను ఖాళీగా ఉంచడం ఎందుకని అనిపించిందో ఏమో.. ‘Rent my handy husband’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. 


ఆ వెంటనే ఫేస్‌బుక్ ఇతరాత్ర సోషల్ మీడియా యాప్స్, స్నేహితుల సహాయంతో గట్టి ప్రచారమే చేసింది. అయితే, మనం ముందుగా భావించినట్లే.. కొందరు ‘డర్టీ మైండ్’తో ఆలోచించారు. ‘A’ పనులైనా చేస్తాడా? నీ భర్త అనే కామెంట్స్ ఆమెను ఆలోచింజేశాయి. కానీ, ఆమె తలచుకున్న పనికి మాత్రం ఆ కామెంట్స్ ఆటంకం కాలేదు. ‘‘మీకు ఇంటి పనిలో సాయం ఉంటాడు. చిన్న పనులను చక్కబెడతాడు. తప్పకుండా నా భర్త తన తీరుతో మెప్పిస్తాడు’’ అంటూ లారా తన భర్తను ప్రమోట్ చేసుకుంది. 


కొంతమంది మహిళలకు లారా ఐడియా బాగా నచ్చింది. ‘‘మీ భర్తను అద్దెకు తీసుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అంటూ ఆమెను ప్రోత్సహించారు. వాస్తవానికి జేమ్స్ ఒక మాజీ వేర్‌హౌస్ వర్కర్. కొన్నేళ్ల కిందట అతడు లారాకు, వారి ముగ్గురు పిల్లలతో తోడుగా ఉండటం కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవలసి వచ్చింది. జేమ్స్ పిల్లల్లో ఇద్దరు ఆటిస్టిక్‌తో బాధపడుతున్నారు. వారికి సాయంగా ఉంటూనే చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. జేమ్స్‌ను అద్దెకు తీసుకొనే మహిళ.. అతడిని ఇంటికి తీసుకెళ్లి పనులు చేయించుకోడానికి 35 పౌండ్లు (రూ.3352) చెల్లించాలి. ఆ మొత్తంతో వారు ఎంత పెద్ద పనులైనా చేయించుకోవచ్చు. వికలాంగులకు, విద్యార్థులకు, 65 ఏళ్లు పైబడిన పెద్దవాళ్లకు మాత్రం తక్కువ ధరలోనే జేమ్స్ తన సేవలు అందిస్తాడు. ఈ ఉద్యోగం ఏదో బాగుంది కదూ. 




Also Read: వింత వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ, ఇది వారసత్వంగా వస్తుందట!


Also read: మిగిలిపోయిన అన్నంతో ఇలా దోశెలు, టేస్టు అదిరిపోతుంది