ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం సాధారణం. ముఖ్యంగా రాత్రి అన్నం మిగిలిపోతే మాత్రం పడేస్తాం. ఈసారి అలా పడేయకండి. మూత పెట్టి ఫ్రిజ్ లో దాయండి. ఉదయం లేచాక వాటితో చక్కగా దోశెలు వేసుకోండి. అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి, తిరిగి వాడడం ఇష్టం లేకపోతే రాత్రే రుబ్బి దాచుకోండి. ఈ దోశెలు ఇన్ స్టెంట్ గా వేసుకోవచ్చు కనుక తల్లులకు ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. స్కూలుకి వెళ్లే పిల్లలకు లంచ్ బాక్సులో, బ్రేక్ ఫాస్ట్ గా వీటిని తయారుచేసి పెట్టేయచ్చు.
కావాల్సిన పదార్థాలు
అన్నం - ఒక కప్పు
బియ్యప్పిండి - ఒక కప్పు
గోధుమపిండి - అరకప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
పెరుగు - పావు కప్పు
వంటసోడా - పావు స్పూను
(ఇష్టంలేకపోతే వేయాల్సిన అవసరం లేదు)
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా...
1. మిక్సీలో అన్నం రుబ్బుకోవాలి. మిక్సీ జార్‌కు అన్నం అంటుకుంటుంటే నీళ్లు పోసి రుబ్బాలి.
2. అందులో గోధుమపిండి, బియ్యంప్పిండి కూడా వేసి కలపాలి. దోశె పిండిలా జారుగా వచ్చే వరకు నీళ్లు పోయాలి.
3. అందులో ఉప్పు, చిటికెడు వంటసోడా కూడా వేసి పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
4. ఈ రుబ్బుని ఫ్రిజ్ లో దాచుకుని ఉదయం దోశెలు వేసుకోవచ్చు. లేదా ఇన్ స్టెంట్‌గా కూడా వేసుకోవచ్చు.
5. పెనంపై నూనె రాసి దోశెలు వేసుకోవాలి.
6. అన్నం దోశెలు చాలా క్రిస్పీగా వస్తాయి.
7. వీటిని కొబ్బరి చట్నీ, టమాట చట్నీలతో తింటతే చాలా రుచిగా ఉంటాయి.
ఆరోగ్యానికి మంచిదేనా?
ఈ దోశెలో వాడినవన్నీ మంచి పదార్థాలే. అన్నం రోజూ మనం తినేదే.శరీరానికి శక్తినిస్తుంది. బియ్యంప్పిండి కూడా దాదాపు అన్నం ఇచ్చే శక్తినే ఇస్తుంది. ఇక గోధుమలు మితంగా తింటే చాలా ఆరోగ్యం. గోధుమలు రక్తాన్ని శుధ్ది చేస్తాయి. ఎర్రరక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. గోధుమల్లో ఫోలిక్ ఆమ్లం, ఐరన్, బి12 పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారి గోధుమలు సాయపడతాయి. ఈ రెసిపీ చేయడం సులువు. ఇలా దోశెలు వేసుకుని తినడం వల్ల అన్నం కూడా వేస్టు కాదు.
Also read: పావురాలతో శ్వాసకోశ సమస్యలు తప్పవా? వాటికి ఆహారం వేయొద్దని గతంలో అధికారులు ఎందుకు చెప్పారు?
Also read: హైదరాబాద్‌లో కచ్చితంగా రుచి చూడాల్సిన ఫుడ్ ఐటెమ్స్ ఇవే, తింటే మైమరచిపోవడం ఖాయం