కూటి కోసం కోటి విద్యలని అంటారు. వాటిలో ఇది కూడా ఒకటి. ఎక్కడా ఉపాధి దొరకడం లేదని అతడు కుమలి పోలేదు. తన బుర్రను వాడాడు. జనాల బద్దకాన్ని, బీజీ లైఫ్‌ను క్యా్ష్ చేసుకోవాలని అనుకున్నాడు. జస్ట్ క్యూలో నిలబడుతూ రోజుకు సుమారు రూ.16 వేలు సంపాదిస్తున్నాడు. అదేంటీ.. క్యూలో నిలబడితే.. డబ్బులు ఎలా వస్తాయనేగా మీ సందేహం. అయితే, మీలో కొందరు ఇప్పటికే గెస్ చేసి ఉంటారు. అతడు క్యూలో నిలబడుతుంది అతడి కోసం కాదు. వేరే వ్యక్తికి బదులు.. అతడు క్యూలో నిలబడుతున్నాడు. ఇందుకు ఆ వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. 


లైన్లో గంటల తరబడి నిలబడటం ఎంత కష్టమో తెలిసిందే. అన్ని పనులు మానుకొని దానికి ప్రత్యేకంగా టైమ్ కేటాయించాలి. లాక్‌డౌన్ సమయంలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అలాగే, ఆఫీసు వెళల్లో క్యూలో నిలబడి పనులు పూర్తి చేసుకోవడం కూడా చాలా కష్టం. ఈ నేపథ్యంలో యూకేకు చెందిన ఫ్రెడ్డీ బ్యాకిట్ అనే 31 ఏళ్ల వ్యక్తి ఇటీవల తన నెలవారీ ఆదాయాన్ని వెల్లడించి అందరికీ షాకిచ్చాడు. 


ఫుల్హామ్‌లో నివసిస్తున్న ఫ్రెడ్డీ.. క్యూలో నిలబడటాన్ని వృత్తిగా మలుచుకున్నాడు. అయితే, అతడు ఎవరిపడితే వారి కోసం క్యూలో నిలబడడు. కేవలం సంపన్న వ్యక్తులే ఇతడి టార్గెట్. ఎందుకంటే.. డబ్బున్న వ్యక్తులు క్యూలో నిలబడటానికి ఇష్టపడరు. కాబట్టి.. వారికి బదులు ఫ్రెడ్డీ క్యూలో నిలబడతాడు. పైగా ఫ్రెడ్డీకి క్యూలో నిలబడటమంటే చాలా ఇష్టమట. అందుకే, దాన్ని ఫుల్‌టైమ్ జాబ్‌గా మార్చేసుకున్నాడు. 


‘‘డబ్బున్న వ్యక్తులు ఎక్కువ సేపు లైన్లో నిలబడలేరు. అందుకు వారికి సమయం కూడా ఉండదు. ముఖ్యంగా పాపులర్ ఇవెంట్స్, షోలలో టికెట్స్ సంపాదించలంటే అంత ఈజీ కాదు. గంటల తరబడి లైన్లో నిలుచోవలసిందే. వారికి అంత ఓపిక ఉండదు. అందుకే, వారికి బదులు నేను లైన్లో నిలబడుతున్నా’’ అని తెలిపాడు. లైన్లో నిలబడినందుకు గంటకు సుమారు 20 పౌండ్లు (రూ.2010) చొప్పున వసూలు చేస్తాడు. లైన్లో నిలబడి టికెట్లు కొనుగోలు చేయడానికే కాదు.. వారు ఆ టికెట్లను తీసుకోడానికి వచ్చే వరకు అతడు వేచి ఉండే సమయానికి కూడా ఛార్జ్ చేస్తాడు. అలా దాదాపు రోజుకు కనీసం రూ.16 వేలు వరకు సంపాదిస్తాడు. ‘‘నేను అడిగితే ఇంకా ఎక్కువ చెల్లించడానికి కూడా కస్టమర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ, నేను చేసే సింపుల్ పనికి 20 పౌండ్లు కంటే ఎక్కువ వసూలు చేయడం న్యాయం కాదు. అందుకే ఆ మొత్తాన్ని పెంచడం లేదు’’ అని తెలిపాడు.