Techniques to Overcome Past: లైఫ్ అన్నాక ఎప్పుడో అప్పుడు కష్టాలు తప్పవు. ఒక్కోసారి వాటిని ఎదుర్కోలేక నీరసపడిపోయి మళ్లీ ఎలాగోలా బౌన్స్ బ్యాక్ అయిపోతుంటాం. కానీ గతాన్ని మాత్రం అంత సులభంగా మర్చిపోలేం. అప్పుడు ఎంత బాధ పడ్డానో కదా అనుకుంటూ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని ఇప్పటికీ తెగ ఫీల్ అవుతాం. కొందరకి జబ్బు చేసి నయం అవుతుంది, ఇంకొందరు ప్రమాదాలకు గురై కోలుకుంటారు, ఇంకొందరు బ్రేకప్‌ని దాటుకుని వస్తారు. ఇలా సమస్య ఏదైనా సరే గుర్తు చేసుకోవడం మాత్రం సహజం. కానీ ఆ నెగటివిటీని ఎన్ని రోజులని మోయగలం..? జీవితం అంతా అలా వాటిని గుర్తు చేసుకుంటూ పోతే అది మన మెంటల్ హెల్త్‌ని దెబ్బ తీసేస్తుంది. అందుకే...ఆ నెగటివ్ వైబ్స్‌ని మనలో నుంచి పోగొట్టే రెండు కొత్త టెక్నిక్‌లను కనుగొన్నారు సైంటిస్ట్‌లు. పాజిటివ్ ఎనర్జీతో గతం తాలూకు చేదు జ్ఞాపకాలన్నింటినీ తుడిచి పెట్టేయొచ్చని ఈ రీసెర్చ్ వెల్లడించింది. ఇందులో రెండు టెక్నిక్స్ గురించి వివరించారు. అందులో మొదటిది Cognitive reappraisal. అంటే గతాన్ని గుర్తు చేసుకుని...అందులో నెగటివిటీని కాకుండా పాటిజివ్ యాంగిల్స్ ఏమున్నాయో అర్థం చేసుకోవడం. దాని గురించి మనం ఆలోచించే తీరుని పూర్తిగా మార్చుకోవడం. ఉదాహరణకు...ఓ వ్యక్తికి బ్రేకప్ అయ్యిందనుకుందాం. అసలు ఈ బాధ నుంచి బయటపడడం సాధ్యం కాదనుకునే ఆ వ్యక్తిని ఈ టెక్నిక్ ద్వారా మార్చుకోవచ్చని చెబుతోంది ఈ స్టడీ. సెల్ఫ్ డిస్కవరీ - మనల్ని మనం తెలుసుకోవడం అనే చిన్న టెక్నిక్‌తో ఈ సమస్య నుంచి బయటపడేసేదే ఈ Cognitive Reappraisal మెథడ్.
గతాన్ని కథలా చెప్పుకోవాలట..
గతం గురించే పదేపదే ఆలోచించకుండా, పూర్తిగా మనని మనం తెలుసుకోవడం, మన కోసం సమయం కేటాయించడం, భవిష్యత్‌లో మరో రిలేషన్‌లోకి వెళ్తే ఎలా డీల్ చేయాలని ఆలోచించడం లాంటివి చేయడం. ఇలా ఆ నెగటివిటీ నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు సైంటిస్ట్‌లు. ఇక రెండో టెక్నిక్ redeem the past. మన గతాన్నంతా ఓ కథలా చెప్పుకోవడం అన్నమాట. సాధారణంగా నెగటివ్ ఫీలింగ్స్‌ని పూర్తిగా చెప్పుకోడానికి ఎవరూ ఇష్టపడరు. అలా లోలోపలే దాచి పెట్టుకోవడం వల్ల అది మోయలేని భారమైపోతుంది. అలా కాకుండా దాన్నో కథగా విడమర్చి చెప్పే అవకాశం ఇవ్వడం వల్ల చాలా వరకూ బాధ తగ్గిపోవచ్చు. దీంతో పాటు ఆ నెగటివ్ ఫీలింగ్ కూడా పోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలా గతాన్నంతా కథలా చెప్పుకోవడం వల్ల అంత పెద్ద స్టోరీలో బాధలన్నీ చాలా చిన్నవే అనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే...ఫిలాసఫీ టచ్‌తో ఇలా ట్రీట్ చేయొచ్చు. ఈ రెండు పద్ధతుల ద్వారా గతంలో ఉన్న బాధలన్నింటినీ మర్చిపోయి హాయిగా బతకొచ్చని చెబుతోంది ఓ అధ్యయనం. నెగటివ్ ఎమోషన్స్‌తో అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగిపోయే వాళ్లకి ఈ టెక్నిక్స్ చాలా బాగా పని చేస్తాయని అంటోంది.