Vijayawada News: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్‌లో ఎన్నికల రోడ్ షో చేస్తుండగా రాయి దాడి జరిగింది. జగన్ ఉన్న వాహనం చుట్టూ ఉన్న జనంలోని ఓ వ్యక్తి ముఖ్యమంత్రిని గురి చూసి రాయితో కొట్టాడని భావిస్తున్నారు. దీంతో సీఎం ఎడమ కంటి పై భాగంలో గాయం అయింది. దాడి కోసం వినియోగించిన వస్తువు క్యాట్ బాల్ అయి ఉంటుందని భావిస్తున్నారు. సీఎం పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు కూడా రాయి తగిలి స్వల్ప గాయం అయింది.
ముఖ్యమంత్రి కోసం భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ రాయి దాడి ఎలా జరిగిందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎంకు భద్రత కోసం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ), సీఎం సెక్యూరిటీ గ్రూపు (సీఎంఎస్‌జీ), క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్, ఎస్కార్ట్, ఇన్నర్ కార్డన్, ఔటర్ కార్డన్ లాంటి రకరకాల భద్రతా వ్యవస్థలు ఉంటాయి. వీళ్లే వందల సంఖ్యలో ఉంటారు. వీరు కాక, ముఖ్యమంత్రి వచ్చిన ప్రదేశానికి చెందిన స్థానిక పోలీసులు కూడా భద్రత కల్పిస్తుంటారు. ఈ స్థాయి భద్రతలోనూ సీఎంపైకి గురి చూసి బలంగా రాయి విసిరి, గాయం చేయగలిగారంటే భద్రతాపరమైన లోపాలపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
మరో ముఖ్యమైన అంశం.. ఆ ప్రాంతంలో పవర్ కట్ ఉండడం. ఆ ప్రాంతం గుండా ముఖ్యమంత్రి పర్యటన అనేది ముందస్తుగా ఫిక్స్ అయిన కార్యక్రమం. అలాంటప్పుడు అక్కడ పవర్ కట్ ఎలా చేస్తారనే ప్రశ్న ఉదయిస్తుంది. సీఎం పర్యటన ఉంటే విద్యుత్తు సరఫరాకు అంతరాయం రాకుండా ముందే చూసుకోవాల్సి ఉంది.
ముఖ్యమంత్రి బహిరంగ ప్రదేశాల్లో జనాల మధ్యలో ఉండగా.. ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీతో పాటు కాస్త దూరంగా ఉండే భద్రతా సిబ్బంది కళ్లు అదే పనిగా ప్రజలపైనే ఉంటాయి. జగన్‌పైకి రాయి వేసినప్పుడు వారు ఎందుకు గమనించలేదనే అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే, వీరు పసిగట్టకుండా ఉండేందుకే కరెంటు కట్ చేశారని కూడా ఓ వాదన ఉంది.