Double Blow for Delhi Capitals Mitchell Marsh David Warner out: ఐపీఎల్‌(IPL)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)కు గట్టి ఎదురు దెబ్బ తలిగింది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఢిల్లీ... ప్లే ఆఫ్‌కు చేరాలంటే మిగిలిన ప్రతీ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న మిచెల్‌ మార్ష్‌.. గాయం తిరగబెట్టడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. చీలమండలో పగులు రావడంతో శస్త్ర చికిత్స కోసం భారత్‌ను వీడాడు. చికిత్స తర్వాత పరిస్థితిని బట్టి తిరిగి ఢిల్లీ జట్టును చేరే అవకాశాలున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో చివరిగా మార్ష్‌ ఆడాడు. ఇప్పటికే రెండు మ్యాచులకు దూరమైన మార్ష్‌... ఆడిన మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో మిచెల్‌ను కెప్టెన్‌గా ప్రకటించే అవకాశాలున్న నేపథ్యంలో అతడు ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడడం సందేహమే. ఢిల్లీకి ఇంకో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వేలి గాయంతో బుధవారం గుజరాత్‌తో మ్యాచ్‌కు ఆడేది అనుమానంగా మారింది. లక్నోతో పోరులో వార్నర్‌కు ఈ గాయం కాగా.. వైద్యులు స్కానింగ్‌ తీయించారు. గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత లేదు. 


పంత్‌ పేరిట అరుదైన రికార్డు
ఐపీఎల్‌ 2024 లో ఢిల్లీ వారియర్స్(DC) కెప్టెన్ రిషబ్ పంత్( Rishabh Pant) అరుదైన రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో మూడు వేల పరుగులు చేసిన బ్యాటర్‌ రికార్డు క్రియేట్ చేశారు.   ఈ 3వేల ప‌రుగుల మార్క్‌ను పంత్ కేవ‌లం 2028 బంతుల్లోనే అందుకున్నాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో శుక్ర‌వారం నాటి మ్యాచ్‌లో 41 ప‌రుగులు చేసి, ఈ రికార్డును నెల‌కొల్పాడు.  స్టోయినిస్ వేసి 12 ఓవర్లలో చివరి బంతిని బౌండరికి తరలించిన పంత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు.  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున 3000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. రిషబ్  ఐపిఎల్ లో ఇప్పటివరకు 104 మ్యాచులో 34 సగటుతో 3032 పరుగులు చేశాడు. 


అత‌ని త‌ర్వాతి స్థానంలో యూసుఫ్ ప‌ఠాన్ (2062), సూర్య‌కుమార్ యాద‌వ్ (2130), సురేశ్ రైనా (2135), మ‌హేంద్ర సింగ్ ధోనీ (2152) ఉన్నారు. అలాగే అతి చిన్న  వ‌య‌సులో 3వేల ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో కూడా  పంత్ (26 ఏళ్ల 191 రోజులు) మూడో స్థానంలో నిలిచాడు. అత‌నికంటే ముందు శుభ్‌మ‌న్ గిల్ (24 ఏళ్ల 215 రోజులు), విరాట్ కోహ్లీ (26 ఏళ్ల 186 రోజులు) ఈ ఫీట్‌ను సాధించారు. 



పంత్ ప్రయాణం ఓ అద్భుతం 
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) గత ఏడాది డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్‌ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది. కొత్త ఏడాది రోజున ఇంట్లో వారికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఢిల్లీ నుంచి ఒంటరిగా పంత్‌ బయల్దేరగా.. ఢిల్లీ-రూర్కీ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన పంత్‌ మళ్లీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడేందుకు తీవ్రంగా శ్రమించాడు. అనుకొన్న సమయం కంటే మూడు నెలల ముందే పంత్‌ మైదానంలోకి అడుగుపెట్టాడు.