పీరియడ్స్ ప్రతి నెల చాలామంది మహిళలు ఎదుర్కొనే బాధకరమైన సమయం. కడుపు నొప్పి, అధిక రక్తస్రావం, వెన్ను నొప్పి, కాళ్ళు నొప్పులు, తీవ్రమైన తిమ్మిర్లు, అతిసారం, మలబద్ధకం, తలనొప్పి వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. కొంతమందికి రుతుక్రమం నెల నెల రాకపోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కష్టమైన కాలనీ ప్రీమెనుస్ట్రువల్ సిండ్రోమ్ అని అంటారు. అలసట, రొమ్ముల్లో నొప్పి, మానసిక ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటివి ఎదురవుతాయి. రుతుక్రమం సరిగా రాకపోవడానికి హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఇటువంటి సమస్య తలెత్తుతుంది.
ఈస్ట్రోజెన్ స్థాయిలు, తక్కువ ప్రొజెస్టెరాన్ స్థాయి కారణంగా నెలసరి సమయంలో అటువంటి విపరీతమైన లక్షణాలు కనిపిస్తాయి. వీటి అసమతుల్యత కారణంగా నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, నొప్పి బాధ కలుగుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గర్భాశయం పొర మందంగా ఉండటం వల్ల రక్త ప్రసరణ పెరగడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రొజెస్టెరాన్ యాంటీ-ప్రొలిఫెరేటివ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల గర్భాశయం పొర మందంగా గట్టిగా ఉండటానికి సహకరిస్తుంది.
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ మధ్య సమతుల్యతను ఎలా?
ఆరోగ్యకరమైన ఆహారం: ఈ రెండు హార్మోన్ల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగకుండా ఉండేందుకు రెడ్ మీట్, పాల ఉత్పత్తులకు కొద్దిగా దూరంగా ఉండాలి. సాల్మన్, సార్డిన్ వంటి చేపలు, అవిసె గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. హార్మోన్ల సమతుల్యత కాపాడుకోవడానికి ఇవి సహాయపడతాయి.
ఒత్తిడి తగ్గించాలి: చాలా మంది మహిళలు ఒత్తిడికి గురవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దాని నుంచి బయటపడేందుకు ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. యోగాసనాల ద్వారా ఒత్తిడిని దూరం చేసి మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
గట్ ఆరోగ్యం కాపాడాలి: గట్(జీర్ణనాళం) లో మిలియన్ల కొద్ది మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది హార్మోన్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే జీవక్రియలను ఉత్పత్తి చేస్తుంది. గట్ మైక్రోబయోమ్‌లు ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల అసమతుల్యతని నియంత్రిస్తుంది.
చక్కెర తక్కువ తినాలి: తీసుకునే ఆహారంలో చక్కెర ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. చక్కెర తగ్గించడం వల్ల హార్మోన్లు సమతుల్యం చెయ్యడంలో సహాయపడుతుంది. ఊబకాయం, మధుమేహం ఇతర వ్యాధులని నివారించడంలో చాలా సహాయపడుతుంది.
బాగా నిద్రపోవాలి: శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంటే అవసరం. హార్మోన్ల మధ్య సంపూర్ణ సమతుల్యత సాధించడానికి నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. అందుకే కంటి నిండా నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పేలవమైన నిద్ర హార్మోన్ల అసమతుల్యతకి కారణం అవుతుంది. దీని వల్ల నెల నెలా వచ్చే పీరియడ్స్ మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: కోడి గుడ్డే కాదు, దాని పెంకు కూడా ఆరోగ్యానికి మేలే!