కోడి గుడ్డు వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే వైద్యులు కూడా రోజుకి ఒక కోడిగుడ్డు తింటే మంచిదని చెప్తుంటారు. గుడ్డు వల్లే కాదు దాని పెంకుల వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. సాధారణంగా కోడిగుడ్డు పెంకులు పడేస్తూ ఉంటారు. కానీ మరి కొంతమంది కోడి గుడ్డు పెంకులు గులాబీ మొక్కలకి వేయడం చూస్తూనే ఉంటారు. సృజనాత్మకత ఉండాలే కానీ మొక్కల కాడల నుంచి గుడ్డు పెంకులు వరకు అన్నీ ఉపయోగకరమే. అయితే ఈ షెల్స్‌లో కాల్షియం, ఇతర పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా? అవి కూడా ఉపయోగపడతాయి. వాటిని ఎలా ఉపయోగించాలో కొన్ని మార్గాలు..
పాత్రలు శుభ్రం చేసుకోవచ్చు
కోడి గుడ్డు పెంకులతో అంట్లు కూడా తోముకోవచ్చు. వాటిని పొడి చేసి సబ్బు నీళ్ళు, బేకింగ్ సోడాతో కలిపి పాన్ లు, ఇతర వంట పాత్రలు క్లీన్ చేసుకోవచ్చు.
విత్తనాలు వేయొచ్చు
కోడిగుడ్డు పెంకుల్లో కొద్ది కొద్దిగా మట్టి పోసి అందులో విత్తనాలు వేసి మొలకెత్తించవచ్చు. అవి కొద్దిగా మొలకలు వచ్చిన తర్వాత దాన్ని తీసి కుండీల్లో పెట్టుకోవచ్చు. చూసేందుకు కూడా చాలా అందంగా కనిపిస్తాయి.
పక్షులకి ఆహారంగా పెట్టొచ్చు
పక్షులకు ఆహారం ఇవ్వడానికి కాల్చిన షెల్లను కూడా ఉపయోగించవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం కాల్చిన గుడ్డు పెంకులు తినడం వల్ల వాటికి అవసరమైన కాల్షియం అందుతుంది.
పులుసుగా చేసుకోవచ్చు
గుడ్డు పెంకుల్లో కొల్లాజెన్, కాల్షియం, గ్లూకోసమైన్‌తో లోడ్ చేయబడ్డాయి. మెత్తగా పొడి చేసుకుని ఉడకబెట్టుకుని పులుసులో వాటిని వేసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరం కూడా.
కాఫీలోని గుడ్డు పెంకులు
కొన్ని నివేదికల ప్రకారం కాఫీకి కోడి గుడ్డు పెంకులు జోడించడం వల్ల అందులోని ఆమ్లత్వం తగ్గుతుంది. 4 కప్పుల కాఫీ చేయడానికి గుడ్డు పొడి లేదా మెత్తగా విరిగిన షెల్ ఉపయోగించవచ్చు.
యాపిల్ సీడర్ వెనిగర్ తో కలిపి
యాపిల్ సీడర్ వెనిగర్ సీసాలో ఎండిన గుడ్డు పెంకులు కలపాలి. ఈ మిశ్రమం యాసిడ్ రిఫ్లక్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. చర్మపు చికాకులకు చికిత్స చేయడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది.
టూత్ పేస్ట్ గా
అవునండి మీరు విన్నది నిజమే. టూత్ పేస్ట్ గా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. దీంతో మీ పళ్ళు తోమడం వల్ల దంతాలు క్లోజప్ యాడ్ లో మెరిసిపోయినట్టు మెరిసిపోతాయి. ఇంట్లోనే ఈ టూత్ పేస్ట్ ని సులభంగా తయారు చేసుకోవచ్చు. అందుకు కేవలం ఒక ఐదు పదార్థాలు ఉంటే సరిపోతుంది. ¼ కప్పు గుడ్డు పెంకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ కాస్టైల్ సబ్బు, కొన్ని చుక్కల పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్ బాగా కలపాలి. అంతే ఏంటో సింపుల్ గా ఎగ్ షెల్ టూత్ పేస్ట్ రెడీ అయిపోయినట్టే.
సూప్స్, జ్యూస్ లో కూడా వేయొచ్చు
కోడి గుడ్డు పెంకుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మీ రోజువారీ కాల్షియం అవసరాలు తీర్చేందుకు సూప్స్, జ్యూస్ లేదా స్మూతిస్ లో గుడ్డు పెంకుల పొడిని కలుపుకుని తాగొచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం కోడి గుడ్డు షెల్ సగం తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన కాల్షియం అందిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: డిమెన్షియా వచ్చే ప్రమాదాన్ని చెప్పేస్తున్న కలలు- కొత్త అధ్యయనం ఏం చెబుతోంది