రీరానికి తిండి, నిద్ర చాలా అవసరం. ఈ రెండింటిలో ఏది సక్రమంగా లేకపోయినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. బరువు నిర్వహణ, రక్త ప్రసరణ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణ.. ఇవన్నీ సక్రమంగా జరిగేందుకు నిద్ర ఎంతో అవసరం. మనలో చాలా మందికి సాధారణంగా నిద్ర పోయేటప్పుడు కలలు వస్తూనే ఉంటాయి. ఇలా కలలు రావడం కూడా ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.  మన కలలు కూడా డిమెన్షియా వ్యాధికి సంకేతాలను చూపిస్తున్నాయని సరికొత్త అధ్యయనం బయటపెట్టింది.


(డిమెన్షియా అంటే?: చిత్తవైకల్యం అనేది ఒక నిర్దిష్ట వ్యాధి కాదు. మెమొరీ లాస్, సరైన ఆలోచనలు చేయకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం వంటి సమస్యలను చిత్త వైకల్యం(డిమెన్షియా)గా పేర్కొంటున్నారు. అల్జీమర్స్ వ్యాధి కూడా చిత్తవైకల్యంలో ఒక భాగం. చిత్తవైకల్యం ఎక్కువగా వృద్ధుల్లో ఎక్కువ కనిపిస్తుంది. కానీ, ఈ రోజుల్లో చిన్న వయస్సులో కూడా ఈ సమస్య వస్తోంది.)


నిద్ర అలవాట్లకి, డిమెన్షియా ప్రమాదంతో ఎలా ముడిపడి ఉన్నాయ్?


స్వీడన్, చైనాకి చెందిన నిపుణులు కొంతమంది వృద్ధుల్లో నిద్ర వ్యవధిని గమనించారు. అది చిత్తవైకల్యం ప్రమాదంతో ముడి పడి ఉన్నట్టు వాళ్ళు గుర్తించారు. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, సమస్యలని పరిష్కరించే సామర్థ్యం మొదలగువాటిని ఇవి ప్రభావితం చేశాయి. చిత్త వైకల్యం సాధారణ రూపాల్లో అల్జీమర్స్ వ్యాధి ఒకటి. దీని వల్ల మతిమరుపు వస్తుంది. జ్ఞాపక శక్తి మందగించి ఏ విషయం గుర్తుండదు.


ఏమిటి ఈ అధ్యయనం?


అమెరికన్ జెరియాట్రిక్స్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం ఎనిమిది గంటలకు పైగా నిద్రపోయే వ్యక్తుల్లో డిమెన్షియా రిస్క్ 69 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. రాత్రి 10 గంటలకు లేదా తర్వాత నిద్రపోయే వారితో పోలిస్తే రాత్రి 9 గంటలలోపు పడుకునేవారిలో అసమానత రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ అధ్యయనం కోసం సుమారు 2వేల మందిని నాలుగు సంవత్సరాల పాటు పరిశీలించారు. స్త్రీలు, పురుషుల్లోని నిద్ర అలవాట్లు, డిమెన్షియా ఎలా ఉంటుందో గమనించారు. త్వరగా లేదా ఎక్కువ సేపు పడుకోవడం అనేది డిమెన్షియాతో ఎందుకు ముడి పడి ఉందనే విషయం వారు సూచించలేదు.


డిమెన్షియా ప్రమాదాన్ని కలలు ఎలా సూచిస్తాయి?


తరచుగా పీడకలలను అనుభవించే వ్యక్తులు చిత్తవైకల్యంతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు నిర్ధరించారు. అల్జీమర్స్ వచ్చే ముందు కొన్ని దశాబ్దాల పాటు చెడు కలలు చాలా తరచుగా రావడం గమనించినట్టు బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం నిపుణులు వెల్లడించారు. 35-64 మధ్య వయస్కులు వారానికోసారి పీడకలలను అనుభవించే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ అని వెల్లడించారు. కొత్త పరిశోధనను నిర్వహించిన యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ సెంటర్ ఫర్ హ్యూమన్ బ్రెయిన్ హెల్త్‌కు చెందిన డాక్టర్ అబిడెమి మాట్లాడుతూ డిమెన్షియాకి చాలా తక్కువ ప్రమాద సూచికలు ఉన్నాయని, అవి కూడా మధ్య వయస్సు వారిలోనే ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు.


అల్జీమర్స్ అనేది మెదడులో కణాలు చనివడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీని బారిన పడిన వారిలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం దెబ్బతింటాయి. వ్యాధి సోకాక కొన్ని గంటల క్రితం జరిగిన విషయాలే మర్చిపోవడం, ఏమీ మాట్లాడమో మర్చిపోవడం వంటివి జరుగుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. చివరికి రోజు వారీ తన పనులు కూడా చేసుకోలేని పరిస్థితులకు చేరుకుంటాడు. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: నూనె Vs వెన్న - హార్ట్ పేషెంట్లకు ఏది మంచిది?


Also Read: రాగి పాత్రల్లో నీరు ఆరోగ్యానికి మంచిదే - కానీ, ఈ సమస్యలు ఉంటే మాత్రం వద్దు!