పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతే అందరికీ ఇబ్బందే. అందంగా మంచి డ్రెస్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే బొజ్జ బయటకు తన్నుకొచ్చి కనిపిస్తుంది. పురుషులు అయితే బొజ్జ వల్ల షర్ట్ బటన్స్ పట్టక ఇబ్బంది పడిపోతారు. ఇక అమ్మాయిల ముందు వారి బొజ్జని కనిపించకుండా చేసేందుకు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అమ్మాయిలైతే అందంగా చీర కట్టుకుంటారు. కానీ పొట్ట అడ్డం పడిపోయి వారి అందాన్ని తుడిచేస్తుంది. నాజూకు నడుము కాకుండా బొజ్జ వల్ల అసలు షేప్ లేకుండా అయిపోతారు. ఈరోజుల్లో అందరికీ ఈ బొజ్జ దగ్గర కొవ్వు సమస్యగా మారిపోయింది.


బొజ్జ అధికంగా ఉండటం వల్ల అందమే కాదు అనారోగ్యాలు కూడా పలకరించేస్తుంది. దీర్ఘకాలికంగా తీవ్రమైన వ్యాధుల రూపంలో మరింత నష్టాన్ని కలిగిస్తుంది. బరువు తగ్గడం, కొవ్వు కరిగించుకోవడం ఒక్కతే దీనికి పరిష్కార మార్గం. బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా వ్యాయామం ఎంత ముఖ్యమో.. సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆరోగ్య నిపుణులు బెల్లీ ఫ్యాట్ కరిగించుకునేందుకు అద్భుతమైన టీ తాగమని సూచిస్తున్నారు. అదే పిప్పరమెంటు టీ లేదా పుదీనా టీ. ఈ టీ తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 


పుదీనా టీ వల్ల బరువు తగ్గుతారా?


పుదీనా వాసన చాలా ఘాటుగా ఉంటుంది. బిర్యానీ వంటకాల్లో అదనపు రుచి ఇవ్వడం కోసం దీన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. ఇక బరువు తగ్గడం విషయానికి వస్తే ఈ టీని డైట్ లో చేర్చుకోవడం వల్ల జీవక్రియని వేగవంతం చేస్తుంది. దీంతో పాటు అదనపు కిలోలను సాధారణం కంటే వేగంగా కరిగిస్తుందని నిపుణులు అంటున్నారు. పుదీనా టీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికం. తక్కువ సమయంలో పొట్టను కరిగించుకునేందుకు ఉపయోగపడే ఉత్తమ పానీయాలలో ఇది ఒకటిగా నిలిచింది.


జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పిప్పరమెంటు నూనె తీసుకునే వారిలో IBS(ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్) లక్షణాల నుంచి ఎక్కువ ఉపశమనం కలిగినట్లు గుర్తించారు. పొట్ట ఉబ్బరం సమస్యను ఇది తొలగిస్తుంది. పొట్ట కొవ్వుని వేగంగా కోల్పోతారు. దీని వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే కండరాలు సడలిస్తుంది. పొట్టలోని గ్యాస్ ని బయటకి పంపించేందుకు సహాయపడుతుంది. పేగు కదలికల్ని సులభతరం చేస్తుంది. మలబద్ధకం సమస్యని నివారిస్తుంది.


బెల్లీ ఫ్యాట్ ఎలా పోగొట్టుకోవాలి?


పొట్ట దగ్గర కొవ్వు పోగొట్టుకోవడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే కాదు సరైన ఆహారాన్ని కూడా ఎంచుకోవాలి. ఆల్కహాల్, దూమపానం వంటి చెడు అలవాట్లు విస్మరించాలి. జీవనశైలిలో పూర్తిగా మార్పులు చేసుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. పోషకాలు అందించే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తినేందుకు ఆసక్తి చూపించాలి. బరువు తగ్గించాలని అనుకున్నప్పుడు ఇటువంటి చెడు అలవాట్లని వదిలేస్తే సగం ఆరోగ్యం మీకు వచ్చినట్టే. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది గుండె, పేగులు, కాలేయం వంటి ఇతర అవయవాల చుట్టూ కూడా పేరుకుపోతుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మైగ్రేన్ వల్ల మెదడు దెబ్బతింటుందా? షాకింగ్ విషయాలు వెల్లడించిన తాజా అధ్యయనం