దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసుపై తాజాగా స్పందించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇది ముమ్మాటికి లవ్ జీహాద్ కాదని అన్నారు. ఇటు అసోం సీఎం బిస్వాశర్మ మాత్రం.. ముమ్మాటికీ ఇది లవ్ జీహాదే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ దారుణమైన హత్య ఇప్పుడు దేశమంతా తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ కేసుకు మతం రంగు పులమడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓవైసీ.. ఇది లవ్ జిహాద్ ఘటన కానేకాదన్నారు. బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు.
ఇది లవ్ జీహాద్ సమస్య కాదని ఒక మహిళపై దోపిడీ, వేధింపుల సమస్య అని దీన్ని అందరూ ఖండిచాలని ఓవైసీ అన్నారు. అంతేకాదు ఈ ఘటనను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని.. ఈ కేసుకు మతం రంగు పులిమారని ఘాటుగా వ్యాఖ్యానించారు ఓవైసీ. మొత్తానికి శ్రద్దా హత్యను మత కోణంలో బీజేపీ చూస్తోంది. బీజేపీ రాజకీయాలు పూర్తిగా తప్పు. ఇది లవ్ జిహాద్ ఘటన కాదు. కానీ.. ఒక మహిళపై హేయనీయంగా ప్రవర్తించడం, వేధించడం.. దాడికి సంబంధించింది. ఆ కోణంలోనే ఈ కేసును చూడాలని ఓవైసీ చెప్పారు.
ఇదిలా ఉంటే.. ముంబై నుంచి ఢిల్లీ వరకు సాగిన ఈ క్రైమ్ సీరియల్‌లో రోజుకో కొత్త టర్నింగ్ వెలుగులోకి వస్తోంది. కొత్త కొత్త ట్విస్ట్‌లు తెర మీదకు వస్తున్నాయి. 2020లో కూడా హత్యకు అఫ్తాద్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ముందే ఓ సారి.. శ్రద్దను చంపేందుకు అఫ్తాద్ ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఆ గొడవ పెద్దదిగా మారింది. సమస్యపై 23 నవంబర్ 2020లోనే ముంబై నలసుపరా పోలీస్ స్టేషన్‌లో శ్రద్ధ ఫిర్యాదు చేసింది. స్నేహితులకు కూడా చెప్పుకుంది శ్రద్ధ. పోలీసులకు రాసిన లేఖలో తన లైవ్-ఇన్ భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా తనను చంపుతానని బెదిరిస్తున్నాడని.. తన మృతదేహాన్ని ముక్కలుగా నరికివేస్తానని బెదిరిస్తున్నాడని శ్రద్ధా వాకర్ ఆరోపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన లేఖ ద్వారా ఆఫ్తాబ్ శ్రద్ధాను క్రమం తప్పకుండా కొట్టేవాడని తెలుస్తోంది. ఆరు నెలలుగా అతను నన్ను కొడుతున్నాడని.. అఫ్తాబ్ తనను కొట్టాడని, చంపడానికి ప్రయత్నించాడని అఫ్తాబ్ తల్లిదండ్రులకు తెలుసునని లేఖలో పేర్కొంది.