మైగ్రేన్.. భరించలేని తలనొప్పి. ఇది వచ్చిందంటే తట్టుకోవడం చాలా కష్టం. వాంతులు, వికారంగా అనిపించడం తల అంతా తిరగడం, దడగా అనిపించే బాధ తట్టుకోలేనిది. చాలా మంది మైగ్రేన్ నొప్పిని తేలికగా తీసుకుంటారు. కానీ అది చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనం వెల్లడించింది. దీని వల్ల మెదడులోని ప్రధాన ఆర్గాన్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉందని షాకింగ్ విషయం వెల్లడైంది. మైగ్రేన్ నొప్పి వస్తే రెండు మూడు రోజుల వరకు తగ్గదు. దీన్నే పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు.
కొత్త అధ్యయనం ప్రకారం మైగ్రేన్ నొప్పితో బాధపడే వ్యక్తుల మెదడులోని మధ్య భాగంలోని రక్తనాళాల చుట్టూ ద్రవం ఏర్పడుతుంది. దీని వల్ల నాడీ వ్యవస్థ, మెదడు నుంచి వ్యర్థాలని బయటకి పంపడంలో ఇబ్బంది పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక మైగ్రేన్ నొప్పితో బాధపడే వారి మెదడు స్కానింగ్ రిపోర్టులు పరిశీలించిన నిపుణులు ఈ షాకింగ్ విషయం వెల్లడించారు. మైగ్రేన్ బాధితుల మెదడులోని సెంట్రమ్ సెమియేవాల్ పెరివాస్కులర్ లో గణనీయమైన మార్పులని గమనించారు. కానీ మైగ్రేన్ సెంట్రమ్ సెమియేవాల్ ని ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అయితే మైగ్రేన్ మెదడు పనితీరుని నాశనం చేసే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మైగ్రేన్ నొప్పి లక్షణాలు
☀ వికారం, వాంతులు
☀ కాంతిని చూడలేకపోవడం, ధ్వని భరించలేరు
☀ దృష్టిలో మార్పులు
☀ కళ్ళు మసకబారడం
☀ తలలో విపరీతమైన నొప్పి
☀ కళ్ళు, మెడ, ముఖంలో భరించలేనంత నొప్పి
☀ ముక్కు దిబ్బడ
☀ నిద్రలేమి
25- 60 సంవత్సరాల వయస్సు కలిగిన 25 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వారి మెదడు స్కాన్లు పరిశీలించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. వారిలో ఎటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు, బలహీనతతో బాధపడటం లేదు. అయితే ఇందులో పాల్గొన్న వారిలో కొందరికి తరచుగా మైగ్రేన్ నొప్పి వస్తే మరికొందరికి అప్పుడప్పుడు వచ్చేడు. ఇంకొంతమందికి అసలు మైగ్రేన్ నొప్పికి సంబంధించిన ఎటువంటి లక్షణాలు లేవు. అయితే మైగ్రేన్ తో బాధపడని వ్యక్తుల కంటే ఆ పరిస్థితితో బాధపడే వారిలో ఎక్కువగా పెరివాస్కులర్ స్పేస్ ఉందని ఫలితాలు వెల్లడించాయి.
మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు చాక్లెట్లకి దూరంగా ఉండాలి. ఇవి తినడం వల్ల నొప్పి 22 శాతం పెరుగుతుంది. షుగర్ ఫ్రీ స్వీట్స్ తినకూడదు. అలాగే ఛీజ్ కి కూడా వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అవి తినడం వల్ల మైగ్రేన్ నొప్పి ఎక్కువ అవుతుంది. కాఫీ, గ్రీన్ టీలు పరిమితంగా తీసుకోవాలి. అందులో ఉండే కెఫీన్ నొప్పి బాధని మరింత పెంచుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మైగ్రేన్ నొప్పి నుంచి బయట పడేందుకు మనసు, మెదడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా ఆందోళన చెందకూడదు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగాసనాలు, ధ్యానం వంటివి వాటి మీద దృష్టి పెట్టాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీరు తందూరి చికెన్ ప్రియులా? జాగ్రత్త దాని వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువేనట