Migraine Attack: చలికాలం వచ్చిందంటే చాలు..చాలా మందిని అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా చలి ప్రభావం వల్ల మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వాాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, చలిగాలుల వల్ల జలుబు, దగ్గు, ఇన్‌ఫ్లుఎంజా వచ్చే అవకాశం సర్వసాధారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాతావరణంలో స్వల్ప మార్పు వచ్చినా వైరస్‌ల బారిన పడే అవకాశం ఉంది. శ్వాసకోశ వ్యాధులు మాత్రమే కాకుండా, శీతాకాలంలో మైగ్రేన్, సైనసైటిస్ సమస్యలు రావచ్చు. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు చాలా మందిని మైగ్రేన్ ఎటాక్ చేస్తుంది. చలికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎదుర్కొనే నిరంతర ఆరోగ్య సమస్య ఇది.
తలనొప్పి అత్యంత సాధారణ సమస్య. దీని వెనుక ఒత్తిడి, అలసట, నిద్రలేమి వంటి అనేక కారణాలు ఉండవచ్చు. దీని నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ తరచూ తలనొప్పి రావడం కూడా మైగ్రేన్‌కు సంకేతం అని మీకు తెలుసా?
చలికాలంలో మైగ్రేన్ తలనొప్పి అనేది, ఉష్ణోగ్రత, వాతావరణంలో మార్పులు కఠినమైన, చల్ల గాలి వల్ల ప్రేరేపితం అవుతుంది. ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయినప్పుడు లేదా అకస్మాత్తుగా చలిగాలులు వచ్చినప్పుడు, సైనస్ లేదా చెవి నొప్పి, మైగ్రేన్ తలనొప్పికి కారణమవుతుంది. ఇప్పటికే మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ సమస్యను మరింత తీవ్రంగా ఎదుర్కొవల్సి ఉంటుంది. చలికాలంలో మైగ్రేన్ సమస్య నుంచి బయటపడే మార్గాలను ఇప్పుడు చూద్దాం.
మైగ్రేన్ ప్రభావాన్ని తగ్గించే మార్గాలు:
- మీ తలను వెచ్చని టోపీ లేదా కండువాతో కప్పుకోండి. తద్వారా చల్లటి గాలి మీకు నేరుగా తాకదు. దీంతో మీరు జలుబును రాకుండా కాపాడుకోవచ్చు.
- మీ తలకు మసాజ్ చేయడానికి నూనెను ఉపయోగించండి. దీంతో మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
- డాక్టర్ సూచించిన మందులు వేసుకుని విశ్రాంతి తీసుకోండి.
- వేడి నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- సమయానికి నిద్రించండి. దాదాపు 8 నుంచి 9 గంటలు నిద్రించేలా చూడండి.
మైగ్రెయిన్ తలనొప్పికి ఇంటి చిట్కాలు
- రాత్రంతా నీటిలో నానబెట్టిన 10-15 ఎండు ద్రాక్షలు తిన్నట్లయితే మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనాన్నిపొందవచ్చు.
- మైగ్రేన్ లక్షణాలు కనిపించినప్పుడల్లా ఒక గ్లాసు నీరు (300 మి.లీ), 3-4 యాలకులు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల, 5 పుదీనా ఆకులను మరిగించి తాగితే మంచిది.
- ఆవునెయ్యి కరిగించి... రెండు మూడు చుక్కలు ముక్కులో వేసుకుంటే చాలా మంచిది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తద్వారా మైగ్రెయిన్ సమస్య నుంచి బయటపడవచ్చు.
Also Read : ఈ ఫుడ్స్ క్యాన్సర్‌ను నివారించడంలో హెల్ప్ చేస్తాయట.. నిపుణుల సలహా ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.