హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో మరోసారి నీటి విషయంలో నష్టం జరగబోతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో కలి హరీష్ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే విషయం రాష్ట్రంలో ఆందోళన పెంచుతుందన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీ(KRMB) పరిధిలోకి వెళ్తే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోకి ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయని.. ఢిల్లీ లో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని విమర్శించారు.
జూలై 2021 లోనే ప్రతిపాదనలు.. వ్యతిరేకించిన కేసీఆర్
ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రం కేఆర్‌ఎంబీ పరిధిలోకి తేవాలని కేంద్రం జూలై 2021 లోనే ప్రతిపాదించగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించారని హరీష్ రావు తెలిపారు. పార్టీలు ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై చర్చించాలని సూచించారు. ఆనాడు కేసీఆర్ పెట్టిన షరతులకు కేంద్రం ఒప్పుకోలేదని చెప్పారు. ఇప్పటివరకూ కృష్ణా జలాల్లో ఇంకా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా తేలనప్పుడు కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
‘కృష్ణా నీటిని ఏపీకి 50 శాతం తెలంగాణ కు 50 శాతం పంపిణీ చేయాలని కూడా షరతు పెట్టాం. శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టీఎంసీ ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేయాలని మరో షరతు పెట్టాం. krmb పై ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని మేము ఆనాడే కోరాం. ఒక సంవత్సరం లో వాడుకోని నీటిని మరో సంవత్సరం వాడుకునేలా వెసలు బాటు కనిపించాలని కేంద్రాన్ని ఇదివరకే కోరాం. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా krmb పరిధిలోకి తెస్తారు ? పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా కేంద్రం ఇవ్వమంటే ఒప్పుకున్నట్టే krmb కి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది. ఇది ఏపీ సీఎం జగన్ విజయం అని వార్తలు వస్తున్నాయని’ హరీష్ రావు పేర్కొన్నారు.
జల విద్యుత్ ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం
krmb పరిధి లోకి ఉమ్మడి ప్రాజెక్టులను తెస్తే జల విద్యుత్ ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దాదాపు 5 వేల మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ను మనం కోల్పోతామని చెప్పారు. krmb చేతిలో ప్రాజెక్టులు పెడితే మనకు ఇష్టం ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉండదు. krmb కి దరఖాస్తు పెట్టి వాళ్ళు అనుమతించే లోపు గ్రిడ్ కుప్ప కూలుతుందన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మొదలు కావడానికి తొమ్మిది గంటలు పడుతుంది. టెయిల్ పాండ్ ప్రాజెక్టు లో విద్యుత్ ఉత్పత్తి కి కూడా వీలు పడదని అభిప్రాయపడ్డారు. నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ ఆయకట్టు పై కూడా krmb ఎఫెక్ట్ ఉంటుందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ కు తాగునీటికి సమస్య ఏర్పడుతుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే..
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీలేరు ప్రాజెక్టును కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై తెలంగాణ కు దక్కకుండా చేశాయంటూ హరీష్ రావు మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ కి నష్టం కలిగినా నీటిని ఎత్తిపోయడంలో ఇబ్బంది లేదు.. ఇప్పటికీ అక్కడ 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పారు. రైతుల కోసం కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టు కు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం పంపులను సాంకేతికంగా 24 గంటలు నడపాలి. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో మోటార్లు నడపకూడదు. కాళేశ్వరం పై రోజుకో లీకు ఫేక్ వార్త ను ప్రభుత్వం సృష్టిస్తోందని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. వాటి కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. ..రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ..వాటి కోసం బీ ఆర్ ఎస్ ఎంతకైనా తెగిస్తుంది