ఆహారం రుచిని పెంచడంలో ఉప్పుది ముఖ్యమైన పాత్ర. అంతేకాదు శరీరానికి కాస్త సోడియం కూడా అవసరం. అయితే మనలో చాలా మంది అవసరానికి మించి సోడియాన్ని, అదేనండి ఉప్పును తినేస్తున్నారు. దీనివల్లే అనేక ఆరోగ్యసమస్యలు వస్తున్నాయి. అయితే స్టవ్ పై వండుతున్నప్పుడు వేసిన ఉప్పు సరిపోకపోతే కొంతమంది తినేటప్పుడు పైన చల్లుకుని, అన్నంలో కలుపుకుని తినేస్తుంటారు. కూర వండుతున్నప్పుడు వేసిన అధిక ఉప్పు కన్నా ఇలా నేరుగా ఆహారంపై చల్లుకుని, కలుపుకుని తినే ఉప్పుతోనే ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఇలా పచ్చి ఉప్పును తినడం వల్ల అకాల మరణం లేదా ముందస్తు మరణం సంభవించే అవకాశం ఎక్కువని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. బ్రిటన్లో దాదాపు అయిదు లక్షల మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఇలా ఉప్పును అధికంగా తినడం వల్ల మీరు జీవించాల్సిన సంవత్సరాలలో కొన్ని సంవత్సరాలు తగ్గిపోతాయి. అంటే ఆరోగ్యసమస్యలతో ముందుగానే మరణిస్తారన్నమాట. 


అధ్యయనం వివరాలు...
యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు. 2006 నుంచి 2010 మధ్యలో దాదాపు 5,01,379 మందిని పరిశోధనలో భాగం చేశారు. వారందరినీ పదేళ్ల పాటూ అనుసరించారు. వారందరి ఉప్పు వినియోగాన్ని పరిశీలించారు. వారికి ఆన్ లైన్లోనే వారి ఉప్పు వినియోగానికి సంబంధించి ప్రశ్నాపత్రం పంపించేవారు. వారిచ్చిన సమాచారాన్ని డేటా రూపంలో పదేళ్ల పాటూ భద్రపరిచారు. ఆ డేలాను పరిశీలించగా ఉప్పు అధికంగా వాడితే అకాల మరణానికి గురయ్యే ప్రమాదం 28 శాతం అధికంగా ఉన్నట్టు తేలింది. ఆహారంలో ఉప్పును అధికంగా వాడిన పురుషుల్లో వారి జీవితం కాలం 2.28 సంవత్సరాలు తగ్గినట్టు గుర్తించారు. అదే మహిళల్లో అయితే ఏడాదిన్నర తగ్గిపోతుందని అంచనా వేశారు. అంటే వారి సహజమరణానికి ఏడాదిన్నర ముందే వీరు మరణిస్తారన్నమాట. 


ఈ పదేళ్ల పరిశోధనలో అధికంగా ఉప్పు వాడేవారిలో 18,500 మంది 75 ఏళ్లు రాకుండానే మరణించారు. ఎవరైనా ఉప్పు తక్కువగా తింటారో, పండ్లు, కూరగాయలు అధికంగా తింటారో వారిలో అనారోగ్య కారకాలు కూడా తక్కువగా నమోదయ్యాయి. ఉప్పు అధికంగా తినేవారికి, ఉప్పు చల్లుకుని మామిడికాయ, జామకాయ వంటి ఆహారాలు లాగించే వారికి ఈ ఫలితాలు షాక్‌నిచ్చేవే. 


అధిక ఉప్పుతో ప్రమాదాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అధిక సోడియం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంది. రోజుకు అయిదు గ్రాముల కన్నా తక్కువ ఉప్పు తినాలని, ఇలా తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్, కరోనరీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ సూచిస్తోంది. 


Also read: రోజుకో గ్లాసు రాగిజావ తాగితే మధుమేహం నియంత్రణలో ఉండడం ఖాయం


Also read: ఈ నాలుగు పండ్లలోని విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో తినకండి



Also read: టీనేజీ పిల్లల్లో హింసాత్మక భావాలను, కోపాన్ని పెంచేస్తున్న వీడియో గేమ్స్, తల్లిదండ్రులూ జాగ్రత్త