Parkinson's disease: తల ఊగుతూనే ఉంటుంది, చేతులు, కాళ్లు వణుకుతూనే ఉంటాయి. నడుస్తున్నంత సేపు శరీరం ఒకటే వణుకు. సరిగా నడవలేరు కూడా. ఇదే పార్కిన్ సన్స్ వ్యాధి. వణికించే జబ్బు అని కూడా అంటారు. శరీరంలోని నాడుల ఆరోగ్యం క్షీణించినప్పుడు పార్కిన్ సన్స్ వ్యాధి వస్తుంది. దీనికి మందు లేదు. చికిత్సలు కూడా ఏమీ లేవు. కాకపోతే కొన్ని రకాల మందులతో ఈ వణకడాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్ది పార్కిన్ సన్స్ వచ్చే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎంతోమంది వృద్ధులు ఈ పార్కిన్ సన్స్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.


మన శరీరం ఏ పని చేయాలన్నా మెదడు నుంచి ఆదేశం రావాల్సిందే. అప్పుడే మనం నడవడం, మాట్లాడడం వంటివన్నీ చేయగలం. ఇవన్నీ నియంత్రించే నాడీ వ్యవస్థ కు వచ్చే అనారోగ్యమే పార్కిన్సన్స్. మెదడులో ఉన్న నాడీ కణాలు నిరంతరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. దీనికోసం కొన్ని రకాల రసాయనాలు సహాయం చేస్తాయి. అలాంటి రసాయనాల్లో డోపమైన్ కూడా ఒకటి. ఇది శరీర కదలికలను నియంత్రించే మెదడులోని ఒక భాగం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఆ భాగం క్షీణించినప్పుడు డోపమైన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అప్పుడే పార్కిన్ సన్స్ వ్యాధి వస్తుంది.


తల చేతులు వణికి పోతూ ఉంటాయి. శరీరం బిగుసుకుపోయినట్టు అవుతుంది. వేగంగా నడవలేరు. సరిగా మాట్లాడలేరు. ఇది శారీరకంగానే కాదు మానసికంగా కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. భావోద్వేగ సమస్యలు వస్తాయి. అయితే ఈ వ్యాధిపై చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. 60 ఏళ్లు నిండిన వారిలో సుమారు పది లక్షల మంది మనదేశంలో ఈ జబ్బుతో బాధపడుతున్నట్టు అంచనా.


పార్కిన్ సన్స్ జబ్బు ఎప్పుడైనా, ఎవరికైనా రావచ్చు. అయితే ఆడవారితో పోలిస్తే మగవారిలోనే ఇది ఎక్కువగా వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. 60 ఏళ్లు దాటిన వారిలోనే ఇది అధికంగా వస్తుంది. చాలా తక్కువ మందిలో 50 ఏళ్ల వయసులోపు వస్తూ ఉంటుంది. జన్యుపరమైన అంశాలు కూడా ఈ వ్యాధి రావడానికి కారణం కావచ్చు. అలాగే పురుగుల మందులు వాడడం, కాలుష్య కారకాల వంటివి కూడా ఈ వ్యాధి రావడానికి దోహదం చేస్తాయి. విటమిన్ డి లోపం వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు.


ఈ వ్యాధి బారిన పడినవారు మానసిక వ్యాధుల బారిన కూడా త్వరగా పడతారు. డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. మతిమరుపు వస్తుంది. ఆహారం మింగడానికి ఇబ్బంది పడతారు. మాట్లాడడానికి తడబడుతూ ఉంటారు. వాసన పీల్చే శక్తి తగ్గిపోతుంది. నిద్ర సరిగా పట్టదు. చేతిరాత మారిపోతుంది.


ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదు. మెదడులో డోపమైన్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన మందులను సూచిస్తారు. అయితే ఆ మందుల వల్ల కాస్త వాంతులు, వికారం వచ్చినట్టు అనిపిస్తుంది. రక్త పోటు కూడా తగ్గుతుంది. వీటన్నింటినీ నివారించడానికి మరికొన్ని మందులను అందిస్తారు. పార్కిన్ సన్స్ వ్యాధి బారిన పడిన వారికి ఫిజియోథెరపీ చాలా ముఖ్యం. అలాగే వ్యాయామం కూడా రోజు చేస్తూ ఉండాలి. 



Also read: డయాబెటిస్ ఉన్నవారికి ఔషధం పనస పిండి - బియ్యం, గోధుమలకు బదులు దీన్ని వాడండి



























































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.