పుట్టిన ప్రతి మనిషికి ఒక రక్త వర్గం ఉంటుంది. ఎవరిది ఏ రక్త వర్గమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వైద్య అధ్యయనాల ప్రకారం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం బ్లడ్ గ్రూపుపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మంది A,B,O,AB... రక్తవర్గాల్లో పాజిటివ్ లేదా నెగిటివ్ రక్త వర్గానికి చెందిన వారై ఉంటారు. రక్త వర్గాలను బట్టే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ఎక్కించాల్సిన రక్తం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ బ్లడ్ గ్రూపేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఎలా విడదీశారు..
A,B,O,AB ... ఈ అక్షరాలు ABO జన్యువు తాలుకూ వివిధ రూపాలను సూచిస్తాయి. వివిధ రకాల రక్త వర్గాలను ఏర్పరచేందుకు రక్త కణాలను ప్రోగ్రామ్ చేస్తాయి. AB రక్త వర్గం కలవారు వారి ఎర్ర రక్త కణాల్లో A, B యాంటిజెన్‌లను ఉత్పత్తి చేస్తారు. ఇక O రకం బ్లడ్ గ్రూపు కలవారు ఎటువంటి యాంటిజెన్‌లను ఉత్పత్తి చేయరు. అలాగే పాజిటివ్, నెగిటివ్ అని విడదీసి చెప్పడంలో కూడా అర్థం ఉంది. ఎర్ర రక్త కణాలపై ప్రొటీన్లు ఉంటే పాజిటివ్, లేకుంటే నెగిటివ్ అని విడదీస్తారు. ఇక O నెగిటివ్ వ్యక్తులు సార్వత్రిక దాతలు. ఎందుకంటే వారి రక్తంలో యాంటిజెన్‌లు, ప్రొటీన్లు ఉండవు. ఎవరి శరీరం అయినా వీరి రక్తాన్ని స్వీకరిస్తుంది.
గుండెజబ్బులు వచ్చే ప్రమాదం
రక్త వర్గాలను బట్టి కూడా వ్యాధులు వచ్చే ప్రమాదం ఆధారపడి ఉంటుందని ఇదివరకే అనేక అధ్యయనాలు చెప్పాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం O బ్లడ్ గ్రూపు కలవారికి మిగతా బ్లడ్ గ్రూపుల వారితో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నాయి పరిశోధనలు. A, B బ్లడ్ గ్రూపులు ఉన్న పురుషులు O బ్లడ్ గ్రూపుకు చెందిన పురుషులతో పోలిస్తే థ్రాంబోసిస్, డీప్ వీన్ థ్రాంబోసిస్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువ. A,B రక్త వర్గాలకు చెందిన వారికి గుండె పోటు వచ్చే అవకాశం 8 శాతం, గుండె ఆగిపోయే ప్రమాదం 10 ఎక్కువ. వీరిలో సిరల్లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం 51 శాతం ఎక్కువ. అలాగే పల్మనరీ ఎంబోలిజమ్ వచ్చే అవకాశం 47 శాతం అధికం. అలాగే రక్తం గడ్డ కట్టే రుగ్మతలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఇవన్నీ గుండె హఠాత్తుగా ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి.
Also read: టిఫిన్ వండుకుని తినే సమయం లేదా? కనీసం వీటినైనా తినండి, లోబీపీ రాకుండా ఉంటుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.