రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అల్పాహారం. ఉదయాన పొట్ట నిండుగా టిఫిన్ చేస్తే చాలు, ఆ రోజంతా చాలా ఉత్సాహంగా సాగుతుంది. కానీ చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు.ఇలా స్కిప్ చేయడం వల్ల దీర్ఘకాలంలో చాలా ప్రభావం పడుతుంది. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఏకాగ్రత తగ్గిపోతుంది. శరీర శక్తి కూడా క్షీణిస్తుంది. కాబట్టి కచ్చితంగా అల్పాహారాన్ని తినాలి. ఒక్కోసారి తినడం కుదరకపోవచ్చు. వండుకుని తినేంత సమయం లేక ఖాళీ పొట్టతోనే లంచ్ వరకు ఉండిపోతారు. ఇది చాలా ప్రమాదం. మీకు అల్పాహారం వండుకోవడం కుదరకపోతే కింద చెప్పిన ఆహారాలు తిని చూడండి. శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. ఉదయానే వండుకోవడం కుదరదని మీకు ముందురోజే అర్ధం అవ్వచ్చు. అలాంటప్పుడు వీటిని రెడీగా పెట్టుకోండి. వండుకోవాల్సిన అవసరం లేకుండా తినేయచ్చు ఇవన్నీ. ఒక్క గుడ్లు మాత్రం ఉడకబెట్టుకోవాలి. 


బాదం పప్పులు
బాదం పప్పులు శక్తిని అందించడంలో ముందుటాయి. వీటిని వండాల్సిన అవసరం లేకుండా నేరుగా తినేయచ్చు. లేదా ముందు రోజు రాత్రి నానబెట్టుకుని తింటే మరీ మంచిది. మీకు మార్నింగ్ వండుకోవడం కుదరదు అని ముందే అనిపిస్తే వీటిని నీటిలో నానబెట్టుకోండి. ఇది చాలా మంచి స్నాక్. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారి పరిశోధన ప్రకారం అల్పాహారం తిననప్పుడు బాదం పప్పులు తింటే అవి రక్తంలో చక్కెర స్థాయులను మెరుగుపరుస్తాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. పిడికెడు బాదం పప్పులు తింటే చాలు అల్పాహారం తిన్నంత శక్తిని పొందవచ్చు. ఆకలి కూడా వేయదు. పోషకాలు పుష్టిగా అందుతాయి. 


ఉడికించిన కోడిగుడ్లు
అల్పాహారం వండుకునే ఓపిక, సమయం లేకపోతే రెండు గుడ్లు తీసి ఉడకబెట్టేసుకోండి. ఇంతకన్నా ఉత్తమ బ్రేక్ ఫాస్ట్ ఏముంది. గుడ్డులో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా స్థిరంగా ఉంటాయి. తీపి పదార్థాలను తినాలన్న కోరికను కూడా తగ్గిస్తుంది. పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పటికీ పెద్ద సమస్య లేదు. మిగతా ఆహారాలేమీ ఆ సమయంలో తినరు కాబట్టి ఈ కొలెస్ట్రాల్ ఖర్చయిపోతుంది కానీ, పేరుకుపోదు. ప్రొటీన్లు, విటమిన్లు గుడ్డు ద్వారా అందుతుంది. కాబట్టి లంచ్ వరకు మీకు చక్కగా పోషణ లభిస్తుంది. 


కొమ్ము శెనగలు
ముందే రోజు రాత్రే వీటిని నానబెట్టుకుంటే ఉదయానే స్నాక్స్ లో నోట్లో వేసుకోవచ్చు. ఇవి కూడా పోషకాలకు నిలయాలు. దీనిలో ఫైబర్, ఫొలేట్, మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అల్పాహారం వండుకోవడం కుదరదు, త్వరగా ఆఫీసుకు వెళ్లాలి అనుకున్న రోజు వీటిని ముందు రోజే నానబెట్టుకుని ఉంచుకుంటే సరి. రెండు గుప్పిళ్ల నిండా ఈ గింజల్ని తింటే సరి పొట్ట నిండిపోతుంది. 


మొలకెత్తిన గింజలు కూడా అల్పాహారం తినని లోటును సంపూర్ణంగా తీరుస్తాయి. పండ్లు లేదా కప్పు పెరుగు తిన్నా మంచిదే. కానీ ఖాళీ పొట్టతో మాత్రం ఉండకూడదు. 


Also read: సామలు సగ్గుబియ్యం దోశెలు, టమోటా చట్నీతో తింటే ఆ రుచే వేరు



Also read: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.