కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత షట్లర్లు.. మరో టోర్నీకి సిద్ధమయ్యారు. జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. ఈ పోటీలు ఈరోజు నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు భారత షట్టర్ల ప్రదర్శన బాగానే ఉంది. 2011 నుంచి ఈ పోటీల్లో కనీసం ఒక పతకమైనా సాధించిన మన బ్యాడ్మింటన్ వీరులు ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.



సింధు దూరం

కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు చీలమండ గాయంతో ప్రపంచ ఛాంపియన్ షిప్‌నకు దూరమైంది. ఈ టోర్నీలో సింధు స్వర్ణం సహా మొత్తం 5 పతకాలు గెలిచింది. ఇప్పుడు ఆమె లేకపోవడం భారత్ కు పెద్ద లోటే.


ఆశలన్నీ ఆ ముగ్గురిపైనే
సింధు గైర్హాజరీలో సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్యసేన్‌పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. గతేడాది రజత, కాంస్య పతకాలు గెలిచిన శ్రీకాంత్, లక్ష్యసేన్ ఈ ఏడాదీ మంచి ఫామ్ లోనే ఉన్నారు. అయితే ఈ ముగ్గురూ ఒకే పార్శ్యంలో ఉండడం ప్రతికూలతగా కనిపిస్తోంది. కామన్వెల్త్ క్రీడల ఆరంగేట్రంలో స్వర్ణంతో అదరగొట్టిన లక్ష్యసేన్.. మూడో రౌండ్లో ప్రణయ్ తో తలపడే అవకాశం ఉంది. 


అంత తేలిక కాదు
ఈ పోటీల్లో పతకాలు సాధించడం మన వాళ్లకు అంత తేలికకాదు. గతేడాది టోర్నీకి దూరంగా ఉన్నకెంటో మొమొటా, జొనాథన్ క్రిస్టీ, ఆంథోనీ ఇప్పుడు బరిలో దిగుతున్నారు. ప్రణయ్ కు రెండో రౌండ్లో మాజీ నెంబర్ వన్ మొమొటా ఎదురుకావచ్చు. 2019 ప్రపంచ ఛాంపియన్ షిప్స్ లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.  మహిళల సింగిల్స్ లో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్, మాళవిక పోటీలో ఉన్నారు. 


డబుల్స్ లో చరిత్ర సృష్టిస్తారా
భారత తరఫున డబుల్స్ లో సాత్విక్- చిరాగ్, మను అత్రి- సుమీత్ రెడ్డి, అర్జున్- ధ్రువ్, కృష్ణ ప్రసాద్- విష్ణువర్ధన్ పోటీలో ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి తొలి స్వర్ణం అందించిన సాత్విక్- చిరాగ్ జోడీపై భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న వీరిద్దరూ మరోసారి పతకం తెస్తారేమో చూడాలి. వీరికి తొలి రౌండ్లో బై లభించింది. 


మహిళల డబుల్స్ లో అశ్విని- సిక్కిరెడ్డి, గాయత్రి- ట్రీసా జాలీ, పూజ- సంజన, అశ్విని భట్- పూజా గౌతమ్ జోడీలు బరిలో దిగుతున్నాయి. మిక్స్ డ్ డబుల్స్ లో  ఇషాన్- తనీష, వెంకట్- జూహీ జంటలు పోటీ పడుతున్నాయి. 


ఈ ఛాంపియన్ షిప్‌లో భారత్ ఇప్పటివరకు 12 పతకాలు గెలిచింది. పీవీ సింధు అత్యధికంగా 5 పతకాలు సాధించింది. సైనా నెహ్వాల్ 2 పతకాలు దక్కించుకుంది. ప్రకాష్ పదుకొనే, శ్రీకాంత్, సాయి ప్రణీత్, లక్ష్యసేన్, జ్వాలా గుత్తా- అశ్విని పొన్నప్ప జోడీ ఒక్కో పతకాన్ని గెలుచుకున్నారు.