దేశాన్నిరక్షించాల్సిన సైనికుడు పైఅధికారులతో గొడవలు పడి పలుమార్లు సస్పెన్డ్‌ అయ్యాడు. అక్కడితో ఆగకుండా ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు చిత్రహింసలకు గురి చేశాడు. గ్రామంలోని చిన్నా పెద్దలపై దాడులు చేస్తూ భయాందోళనలు కలిగించాడు. ఇంత సహించి భరించినా చివరకు ఆదివారం వేకువజామున 3.30 గంటలకు తన తల్లిని చావ బాదాడు. ఆ తర్వాత భుజంపై వేసుకుని ఇంటి వెనుక భాగంలో ఉన్న పొలంలో విసిరి పడేశాడు. 


స్తంభానికి కట్టేసి కొట్టి..


ఇది చూసి తట్టుకోలేని తండ్రి తన కుమారుడ్ని సమీపంలోని కరెంట్ స్తంభానికి తాళ్లతో కట్టి బంధించాడు. తన భార్య పరిస్థితిని గమనించి 108 వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. తాళ్లతో కట్టి ఉంచిన కుమారుడు అంతటితో ఆగక తన తండ్రిని దుర్భాషలాడుతూ నువ్వు తిరిగి వచ్చేలోగా అందర్నీ చంపేస్తానని బెదిరించాడు. ఇది సహించలేని తండ్రి ఇనుప రాడ్డుతో బలంగా తలపై కొట్టడంతో అతను అక్కడికి అక్కడే మరణించాడు. వెను వెంటనే తండ్రి పోలీసులకు జరిగిన ఉదంతం అంతా వివరించి లొంగిపోయాడు. ఇది నరసన్నపేట మండలం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కిల్లాం గ్రామంలో ఈ సంఘటన జరిగింది.


ఆర్మీ నుంచి నాలుగు సార్లు సస్పెండ్..


కిల్లాం గ్రామంలో నివాసం ఉంటున్న గొలివి సూర్య నారాయణ తన భార్య పోలమ్మ, కుమారుడు రాముతో నివాసం ఉంటున్నారు. రాము చిన్నతనంలోనే తన ప్రతిభ కనబర్చి ఇండియన్ ఆర్మీకు ఎంపికై సర్వీసులో చేరాడు. అయితే అతని కోపం కారణంగా పైఅధికారులతో ఘర్షణలకు పాల్పడటంతో తొమ్మిది సార్లు సస్పెండ్ అయ్యాడు. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన రాము, గ్రామస్తులకు సైతం ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. అంగన్వాడీ సెంటర్‌కు వెళ్లి అక్కడి పిల్లలను, టీచర్లను దుర్భాషలాడేవాడు. గ్రామంలోని పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను కూడా తన దూకుడు తనంతో ఇబ్బంది పెట్టేవాడు. ఇది సరికాదని వారించిన వారిపై దాడులకు తెగబడేవాడు. అంతటితో ఆగకుండా ఉన్మాదిలా మారి గ్రామంలోని అమ్మవారి ఆలయంలోకి వెళ్లి అక్కడి దేవతా విగ్రహం చేతులను కత్తితో నరికేందుకు ప్రయత్నించాడు. 


వెళ్లిపోయిన భార్య, మరో పెళ్లి చేయాలంటూ తల్లిపై దాడి..


పాఠశాలకు వెళ్లే విద్యార్థినులను సైతం వెంటపడి తరిమేవాడు. అతను ఉన్నాడంటే చాలు అటుగా వెళ్లేందుకు చిన్నారులు భయపడేవారు. ఇది చూసి తన తల్లిదండ్రులు గ్రామస్తులను మన్నించమని వేడుకునేవారు. తన దూకుడు మరింత పెరిగి తనకు ఉన్న బులెట్ వాహనంపై ఐదు లీటర్ల నూనె వేసి, దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి తగులబెట్టేశాడు. తన భార్య ఇతని చేష్టలను తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు మళ్లీ పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులను చావబాదేవాడు. తన ప్రవర్తన ఒక సైకోగా మారడంతో గ్రామస్తులు కూడా భయపడే వారు. తన తల్లినే ఇష్టానుసారంగా కొట్టడంతో తట్టుకోలేని తండ్రి స్తంభానికి కట్టి ఇనుప రాడ్డుతో గట్టిగా కొట్టడంతో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే నరసన్నపేట పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన సంఘటన వివరించి స్వచ్ఛందంగా లొంగిపోయాడు.