Rains In Telangana: వాయుగుండం తీరం దాటి 24 గంటలు గడిచినా దాని ప్రభావం పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ, యానాం, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయం, నైరుతి బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కొన్నిచోట్ల గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తీరంలో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు, శ్రీలంక వైపు నుంచి ఏపీ, తెలంగాణ వైపు గాలులు వీస్తాయని.. రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
తెలంగాణలో వర్షాలు
తీవ్ర వాయుగుండం తీరం దాటి రోజు గడుస్తున్నా.. దీని ప్రభావం తెలంగాణపై కొనసాగుతూనే ఉంది. మెదక్, ఎం మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, కామారెడ్డి, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్‌లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేసినా భారీ వర్షం పడే సూచనలు లేవు. తేలికపాటి జల్లులు పడతాయని నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 23 కాగా, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల వరకు నమోదు అవుతోంది. నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో దాని ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉదయం చల్లగా ఉన్నా, మధ్యాహ్నం వేడెక్కి ఉక్కపోతగా ఉంటుంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లుండి తేలికపాటి జల్లులు పడతాయి.