విమానాలు గాల్లో ఎగిరే సమయంలో అత్యంత సున్నితంగా ఉంటాయి. చిన్న పక్షి అడ్డొచ్చినా ప్రమాదమే. పక్షి కారణంగా విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సేమ్ ఇలాగే ఓ ఫుట్ బాల్ ప్లేయర్ తన్నిన బంతి తగిలి ఓ విమానం కూలిపోయిందని మీకు తెలిసి ఉండదు. కానీ ఇది నిజంగా జరిగిన ఘటన. ఇంతకీ ఆ బంతిని తన్నిన ప్లేయర్ ఎవరు? ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది?


సుమారు ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఘటన ఇది. పుట్ బాల్ ను తన్నిన ఆటగాడు మరెవరో కాదు.. పరాగ్వే లెజెండరీ  క్రీడాకారుడు రాబర్టో గాబ్రియేల్ ట్రిగో. ఆ సమయంలో ఆయన వయసు 17 ఏళ్లు. అప్పట్లో అతడు జనరల్ జీన్స్ ఫుట్‌ బాల్ క్లబ్ ఆఫ్ అసన్‌సియోన్‌కు రైట్‌ బ్యాక్‌ గా ఆడుతున్నాడు. స్థానిక ఫుట్‌ బాల్ మైదానం మీదుగా చిన్న విమానం వెళ్తున్నది. ఆ విమానం చేస్తున్న శబ్దం అతడికి కోపం తెప్పించింది. ఒక్కసారిగా బంతిని బలంగా తన్నాడు. అది నేరుగా వెళ్లి విమానం ఇంజిన్ కు తగిలింది. ఆ దెబ్బకు విమానం కదిలిపోయింది. అదుపు తప్పింది. ఆ ఫుట్‌బాల్ మైదానానికి 200 మీటర్ల దూరంలో ఆ విమానం కూలిపోయింది. 


విమానం నడుపుతున్న పైలెట్ మరెవరో కాదు.. ఆల్ఫ్రెడో లిర్డ్. ట్రిగోకు అతడు బాగా తెలుసు.  ఆయన ఫుట్ బాల్ ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కావాలనే మైదానం మీది నుంచి తక్కువ ఎత్తులో వెళ్లేవాడు. అయితే అలా వెళ్లిన ప్రతిసారి ట్రిగో తోటి ఆటగాళ్లతో అనేవాడు.. “ఏదో ఒకరోజు నేను బంతిని తంతే.. అది వెళ్లి విమానానికి తగులుతుంది. ఆ తర్వాత కూలుతుంది” అంటూ నవ్వేవాడు. చివరికి అతడు చెప్పిందే నిజమైంది. అతడు తన్నిన బంతి తగిలి విమానం కూలింది.


వాస్తవానికి ట్రిగోకు ఆ విమానాన్ని కూల్చాలనే ఉద్దేశం లేదు. అంత వరకు బంతి వెళ్తుందా, లేదా అనేది క్యూరియాసిటీ. అయితే, ఆ బంతి నిజంగానే విమానాన్ని తాకడం, కళ్ల ముందే విమానం నేలపై కూలిపోవడం చూసి ట్రిగో షాకయ్యాడు. దీంతో అప్పటివరకు సీరియస్‌గా సాగుతున్న ఆట ఆగిపోయింది. ట్రిగో భయంతో చెమటలు కక్కుతున్నాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న తోటి క్రీడాకారులు ట్రిగోను వెంటనే లోపలికి తీసుకెళ్లి కూల్ వాటర్ ఇచ్చారు. తల మీద కూడా పోశారు. కొద్ది సేపట్లోనే ఓ వార్త వినిపించింది. ఓ వ్యక్తి వచ్చి.. మీరేం ఆందోళన చెందకండి. పైలెట్ క్షేమంగానే ఉన్నాడని చెప్పాడు. అప్పుడు ట్రిగో మనసు కుదుటపడింది.    


ట్రిగోకు ఇప్పుడు 80 ఏళ్లు. ఈ సందర్భంగా 1957లో ప్రెసిడెంట్ హేస్ ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన ఆట గురించి ఆయన గుర్తు చేసుకున్నాడు.  అయితే విమానంలో లిర్డ్‌తో పాటు చిన్న పిల్లాడు ఉన్నాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడలేదు. ఈ ఘటన జరిగిన కొంత సమయానికి మళ్లీ మ్యాచ్ మొదలయ్యింది. ట్రిగో జట్టు 2–0 తేడాతో విజయం సాధించింది.  తాను చేసిన పనికి లిర్డ్ ఏనాడు తనపై కోప్పడలేదని ట్రిగో తెలిపాడు. ఇద్దరూ మంచి మిత్రులు అయినట్లు చెప్పారు. నాడు ట్రిగో విమానాన్ని కూల్చిన విషయం పరాగ్వే ప్రసార సాధనాల్లో హెడ్ లైన్ గా మారింది. ఈ విషయాన్ని ట్రిగో తాజాగా గుర్తు చేసుకుని నవ్వుకున్నారు.


Also Read: ఈ హోటల్ కేవలం పందులకే - ఫుల్ సెక్యూరిటీ, వైద్యుల పర్యవేక్షణతో లగ్జరీ లైఫ్!



Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!